పలు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ లో చేరేందుకు కీలక నేతలు సిద్దంగా ఉన్నారని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. అదంతా హైప్ క్రియేట్ చేసుకునేందుకేనని రోజులు గడిచే కొద్ది తెలిసి వస్తోంది. ఏపీలో వైసీపీ, టీడీపీకి చెందిన కీలక నేతలు టచ్ లో ఉన్నారని చివరికి జనసేన నేత తోట చంద్రశేఖర్ ను పార్టీలో చేర్చుకొని అద్యక్ష బాధ్యతలు కట్టబెట్టారు. అక్కడే బీఆర్ఎస్ దొరికిపోయింది. కీలక నేతలు టచ్ లో ఉన్నారని డబ్బా ప్రచారం చేసుకుంటుందని స్పష్టత వచ్చింది.
తాజాగా ఒడిషాకు గిరిధర్ గమాంగ్ అనే సీనియర్ నేతకు ఆ రాష్ట్ర బీఆర్ఎస్ అద్యక్ష బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆయన సాంకేతికంగా ఇప్పుడు బీజేపీలో ఉన్నప్పటికీ ఆయన పార్టీలో యాక్టివ్ గా లేరు. అదే సమయంలో బీజేపీ కూడా ఆయనను పట్టించుకోవడం లేదు. ఎనభై ఏళ్ల గిరిధర్ గమాంగ్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరపున పలుమార్లు గెలిచారు. 1999లో ఆరేడు నెలల పాటు ముఖ్యమంత్రిగా కూడా వ్యవహరించారు. ఎంపీగా ఉన్న సమయంలోనే ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఎంపీ పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. ఆ సమయంలో ప్రధానమంత్రిగా వాజ్ పేయి ఉండేవారు. అప్పుడు జరిగిన విశ్వాస పరీక్షలో సీఎంగా కొనసాగుతూనే ఎంపీ పదవికి రాజీనామా చేయకుండానే విశ్వాస పరీక్షలో పాల్గొన్నారు. ఇది అనైతికం. అప్పట్లో బలాబలాలు చాలా క్లిష్టంగా ఉండటంతో చివరికి ఒక్క ఓటు తేడాతో వాజ్ పేయి ప్రభుత్వం కూలిపోయింది. గిరిధర్ గమాంగ్ కారణంగానే వాజ్ పేయ్ ప్రభుత్వం కుప్పకూలిందన్న ప్రచారం జరిగింది. ఆ తరువాత ఎన్నికలు వచ్చాయి.
అప్పటి నుండి ఆయన మరోసారి ఎన్నికల్లో గెలవలేకపోయారు. ఎందుకో కాంగ్రెస్ పార్టీకి కూడా దూరమయ్యారు. ప్రస్తుతం ఆయన వయసు దృష్ట్యా రాజకీయాల్లో యాక్టివ్ లేరు. ఆయన తన రాజకీయ వారసుడిగా చెబుతున్న కుమారుడు శిశిర్ గమాంగ్ రాజకీయ భవిష్యత్ ను తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఓడిసా చీఫ్ గా ఉండాలని ఆయనకు ఆఫర్ ఇచ్చారు. ఆయన వలన ఎలాంటి లాభం లేకపోయినా ఎవరో ఒకరు చెప్పుకోవడానికి పేరు మోసిన నేత ఉండాలని ఇలా ఆవుట్ డేటెడ్ నేతలకు అవకాశం కల్పిస్తూ బీఆర్ఎస్ పరువు తీసుకుంటున్నారు.
Also Read : కేసీఆర్ ఇజ్జత్ పాయె – గల్లీలోనే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ..!