ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తనే చంపేసింది ఓ మహిళ. భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి అతను నిద్రలోకి జారుకున్నాక ప్రియుడి సహాయంతో భర్త గొంతుకు వైర్ బిగించి హత్య చేసింది. ఈ దారుణ ఘటన విశాఖపట్నం జిల్లా భీమిలి పొలిసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
జీవీఎంసీ రెండో వార్డు పరిధి వలందపేటకు చెందిన వంకా పైడిరాజు (34) అనే వ్యక్తి టైల్స్ కాంట్రాక్ట్ పనులు చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. ఈయనకు భార్య జ్యోతి (22)తోపాటు నాలుగేళ్ల కుమార్తె, కుమారుడు ఉన్నారు. గత నెల 29వ తేదీన పైడిరాజు రాత్రి భోజనం చేసి భార్య పిల్లలతో కలిసి నిద్రపోయాడు. మరుసటి రోజు తన భర్త కనిపించడం లేదంటూ జ్యోతి భీమిలి పోలీసులకు కంప్లైంట్ చేసింది.
జ్యోతి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే, జ్యోతి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పైడిరాజు సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను విచారించగా అసలు విషయాలు బయటకొచ్చాయి. జ్యోతి ఉండే ప్రాంత సమీపంలో శ్రీనివాస రావు (23)తో ఆమెకు అక్రమ సంబంధం ఏర్పడింది. అప్పటి నుంచి వారిద్దరూ కలుసుకోవడం ప్రారంభించారు. అయితే, ఇలా ఎవరైనా చూస్తె అనుమానం వస్తుందని విశాలాక్షి నగర్ లో భార్యభర్తలని వారిద్దరూ ఓ గదిని అద్దెకు తీసుకున్నారు.
జ్యోతికి పోలీసు ఆఫీసులో అటెండర్ ఉద్యోగం వచ్చిందని నకిలీ అపాయింట్ మెంట్ లెటర్ సృష్టించి భర్తకు చూపించారు. అదే నిజమని పైడిరాజు అనుకున్నాడు. దాంతో జ్యోతి రోజూ విశాలాక్షి నగర్ కు వెళ్లి శ్రీనివాస రావును కలిసి సాయంత్రం వస్తుండేది. ఇలా ఎన్నాళ్లు రహస్యంగా కలుసుకుంటామని.. పైడిరాజును లేపేసే ప్రశాంతంగా ఇద్దరం కలిసి జీవించొచ్చునని భావించారు. ఇందుకోసం ఇద్దరు కలిసి స్కెచ్ వేశారు.
ప్లాన్ లో భాగంగా, గత నెల 29వ తేదీన రాత్రి భర్తకు వడ్డించే భోజనంలో నిద్రమాత్రలు కలిపింది జ్యోతి. ఆ తర్వాత తన ప్రియుడిని ఇంటికి పిలిచి అతని సహాయంతో భర్త గొంతుకు వైరు బిగించి చంపేశారు. మృతదేహాన్ని స్కూటర్‌పై ఉంచి విశాలాక్షి నగరులోని తన గదిలో రాత్రంతా ఉంచాడు శ్రీనివాస రావు. ఆ మరుసటి రోజు శ్మశానానికి తీసుకెళ్లి అనాథ శవంగా చెప్పి శ్మశానంలో అంత్యక్రియలు పూర్తి చేశాడు. ఈలోగా జ్యోతి తన భర్త కనిపించడం లేదని భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చేసినట్టు పోలీసులు విచారణలో తేల్చారు.