ఏపీలోని పల్నాడు జిల్లా ఈపూరు మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడు తన దగ్గర చదువుకునే విద్యార్ధినిపై మూడేళ్ళుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఆపై బలవంతంగా బాలికను పెళ్లి చేసుకొని ఆ అమ్మాయికి నరకం ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు ఆ కీచక ఉపాధ్యాయుడు. అతని వేధింపులు రోజురోజుకు అధికం కావడంతో బాధిత బాలిక పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు.
ఈపూరు మండలంలో ఓ గ్రామానికి చెందిన విద్యార్ధిని టెన్త్ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన ప్రైవేట్ ఉపాధ్యాయుడు బత్తుల రవి కుమార్ దగ్గర విద్యనభ్యసిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ బాలికపై కన్నేసిన రవి కుమార్.. అమ్మాయిని ఓరోజు తన ఇంటికి పిలిచి కూల్ డ్రింక్స్ లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. ఆ తరువాత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక మత్తులో ఉండగానే నగ్నంగా ఉన్న ఫోటోలను తీసి బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ ఫోటోలను అడ్డు పెట్టుకొని బాలికను బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడు.
విషయం అందరికీ తెలియడంతో గత ఏడాది సెప్టెంబర్ లో బాధితురాలి కుటుంబ సభ్యుల సమక్షంలో బలవంతంగా బాలిక మెడలో రవి కుమార్ తాళి కట్టాడు. నవంబర్ 22న ఆ బాలికను పిడుగురాళ్ళకు తీసుకెళ్ళి తన వదిన ఇంట్లో నిర్బంధించాడు. అప్పటి నుంచి ప్రతి రోజు బాలికపై అతని వేధింపులు మరింత ఎక్కువయ్యాయి.
ఈ క్రమంలో పలు న్యూడ్ వీడియోలు తీశాడు. వాటిని చూపి బెదిరిస్తూ విడతలవారీగా బాలిక కుటుంబ సభ్యుల నుంచి రూ.2 లక్షల మేరకు వసూలు చేశాడు. అయినా , అతగాడి వేధింపులు తగ్గకపోగా.. ఎక్కువ కావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డీఎస్పీ విజయభాస్కర్ ఈపూరు ఎస్ఐను ఆదేశించారు.
Also Read : పదో తరగతి కూడా పూర్తి కాలేదు – అప్పుడే తల్లులు అవుతున్నారు..!