వచ్చే ఎన్నికల్లో వైసీపీని డీకొట్టేందుకు పొత్తులుంటాయని పవన్ కళ్యాణ్ తేల్చేశారు. ఒంటరిగా వెళ్ళడం వలన ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ చీలి అది అంతిమంగా వైసీపీకి లాభిస్తుందని పవన్ చెప్పుకొచ్చారు. అందుకే ఉమ్మడిగా వెళ్ళడమే బెటర్ అని జన సైనికులకు రణస్థలం సాక్షిగా పవన్ సూచించారు.
పొత్తు విషయాలపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గౌరవ ప్రదమైన పొత్తులు ఉండాలంటూ టీడీపీకి సంకేతాలు పంపారు.అయితే, పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నట్లుగా టీడీపీ నుంచి పొత్తుల విషయంలో గౌరవం దక్కుతుందా..?లేదా అన్నదే టీడీపీ – జనసేన పొత్తుపై ఆధారపడి ఉంది.
ఇటీవల చంద్రబాబుతో జరిగిన భేటీలో పొత్తు అంశాలపై చర్చించలేదని రాష్ట్ర సమస్యలపైనే చర్చించామని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఈ అంశం తమ మధ్య చర్చలోకి రాకపోయినా భవిష్యత్ లో టీడీపీతో కలిసి సాగే అవకాశం ఉందని స్పష్టత ఇచ్చారు. టీడీపీహో పొత్తు తాము కోరుకున్నట్లు గౌరవంగా ఉండాలని పవన్ పరోక్షంగా చెప్పారు.
పవన్ ప్రస్తావించిన గౌరవం అనే మాట ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది. గౌరవమైన పొత్తు అంటే పవన్ లెక్కలో.. సీట్లు, అధికార భాగస్వామ్యంలో జనసేనకు కోరుకున్న ప్రాధాన్యత ఇవ్వడం. మరి.. జనసేన కోరిన సీట్లను ఇచ్చేందుకు టీడీపీ సుముఖత చూపుతుందా.. అన్నది ప్రశ్న. వైసీపీని గద్దె దించాలని కృతనిశ్చయంతోనున్న చంద్రబాబు జనసేనానికి ఆయన కోరుకున్న గౌరవం తప్పకుండా ఇచ్చి తీరుతారు. పార్టీ నేతలను కన్విన్స్ చేసైనా సీట్ల విషయంలో జనసేనకు ప్రాధాన్యత ఇస్తారు.
ఎందుకంటే.. గతంలో కంటే జనసేన యాక్టివ్ అయింది. ఏపీ సర్కార్ పై టీడీపీతో సమానంగా కొట్లాడుతోంది. ప్రజల్లో కూడా జనసేనపై మునుపటి కంటే ఆదరణ అధికమైంది. అందుకే వచ్చే ఎన్నికల్లో కొంచెం అటు, ఇటు అయినా జనసేన కోరిన సీట్లు ఇచ్చేందుకు బాబు అంగీకరించే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ తమతో కలిసి వస్తే కలుపుకుపోవాలని జనసేన, టీడీపీలు భావిస్తున్నాయి. అధికారమే లక్ష్యంగా సీట్ల పంపకాలు జరగాలని కోరుతున్నారు.
Also Read : చంద్రబాబు- పవన్ కళ్యాణ్ లను కలిపిన జగన్ రెడ్డి..!