తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు మారేలా లేరు. మాణికం ఠాగూర్ ను తొలగించి మాణిక్ రావు థాకరేను రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గా అపాయింట్ చేసినా సీనియర్లు బెట్టు వీడటంలేదు. మాణిక్ రావు థాకరే మొదటి సారి రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా సీనియర్ నేతలు తమ పంథా మార్చుకోకపోవడం గమనార్హం.
గాంధీభవన్ కు వచ్చి కలవాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మాణిక్ రావు థాకరే సూచించారు. గాంధీ భవన్ కు తాను రానే రానని వెంకట్ రెడ్డి చెప్పారు. దాంతో బయట హోటల్లో బ్రేక్ ఫాస్ట్ సమయంలో థాకరేను కలిసి మాట్లాడారు. ఆ తరువాత ఆయన కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏఐసీసీ ఇచ్చిన షోకాజ్ నోటీసులను తాను ఏమాత్రం ఖాతరు చేయలేదని చెప్పేశారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో వెంకట్ రెడ్డికి హైకమాండ్ రెండు సార్లు షోకాజ్ నోటిసులు జారీ చేసింది. వాటిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా అవి ఎప్పుడో చెత్తబుట్టలోకి చేరాయని అవమానకరంగా మాట్లాడేశారు.
మరోవైపు గాంధీ భవన్ లో థాకరేను కలిసిన మరికొంతమంది సీనియర్లు రేవంత్ రెడ్డి టార్గెట్ గా గళాన్ని వినిపించినట్లు తెలుస్తోంది. త్వరలో రేవంత్ చేపట్టనున్న పాదయాత్రకు అనుమతి నిరాకరించేలా దింపుడు కళ్ళం ప్రయత్నాలు చేశారు. కాని వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు. గత ఇంచార్జ్ తమ ఫిర్యాదులను పెద్దగా పట్టించుకోలేదని.. మీరైనా మా వినతిని ఆలకించండి అంటూ థాకరేను కాకా పట్టేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. కాని సీనియర్లకు మాణిక్ రావు థాకరే చివర్లో ఝలక్ ఇచ్చి వెళ్ళిపోయారు.
రేవంత్ పాదయాత్ర 26 నుంచి ప్రారంభం అవుతుందని మాణిక్రావు ధాకరే మీడియా సమావేశంలోనే ప్రకటించారు. దీంతో సీనియర్ల నోట్లో పచ్చి వెలక్కాయ్ పడినట్లు అయింది. అధిష్టానం కూడా రేవంత్ పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వడంతో సీనియర్ల ఆఖరి ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి.
Also Read : మాణిక్ రావు చాలా హార్డ్ గురూ.. సీనియర్లు జర భద్రం..!