వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి బరిలో ఉంటానని చెప్పిన వైఎస్ షర్మిల అక్కడ గెలిచేందుకు అప్పుడే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలకు చేరువ అయ్యేందుకు ఉచిత పథకాలను అమలు చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా పాలేరులో ఇంటి నిర్మాణం ప్రారంభించారు. ఇప్పుడు ప్రజలను ఆకట్టుకునేందుకు ఉచిత పథకాలపై ఫోకస్ పెట్టారు.
పాలేరు నియోజకవర్గంలో మెజార్టీ ఓటర్లకు ఆరోగ్య శ్రీ కార్డు తరహాలో కార్డులను ఇచ్చి ఉచిత వైద్యం అందించేలా ప్రిపేర్ అవుతున్నారు. ఖమ్మంలోనే కాకుండా హైదరాబాద్ లోనూ ఫ్రీగా ట్రీట్మెంట్ ఇప్పించేలా ఉచిత వైద్యానికి అందే ఖర్చును పార్టీనే భరించేలా కసరత్తు చేస్తున్నారు.
పాలేరు నియోజకవర్గంలో నాలుగు మండలాలకు నాలుగు అంబులెన్స్ లను ఇప్పటికే రెడీ చేశారు. ఇక పేద విద్యార్థులకు ప్రైవేట్ స్కూల్, కాలేజ్ లో ఉచిత విద్య అందించేలా ఖర్చు చేయాలనుకుంటున్నారు. ప్రైవేట్ స్కూళ్ళతో ఒప్పందం చేసుకొని ఆ ఫీజ్ ను పార్టీనే భరించేలా అగ్రిమెంట్ చేసుకోవాలనుకుంటున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం అమలు చేయనున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఉన్నత విద్యను చదివే విద్యార్థులకు ఆర్ధిక సాయం అందించేందుకు నియోజకవర్గంలో ప్రత్యేక ఆఫీసును అందుబాటులోకి తీసుకోస్తున్నారు.
మరోవైపు.. పాలేరు నియోజకవర్గంలో ఎవరైనా చనిపోతే మృతుల కుటుంబాలకు రూ. 25వేల చొప్పున ఇవ్వనున్నారు. ఇప్పటికే ఈ సాయం ప్రారంభించారు. గర్భిణీకి రూ.10వేలు, అమ్మాయి పుడితే రూ.25వేల చొప్పున అందిస్తామని.. పేదల ఇండ్లలో పెళ్లిళ్లకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తామని వైఎస్ఆర్ టీపీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న వైఎస్ షర్మిల, ఈనెల 19న హైదరాబాద్ తిరిగి రానున్నారు. ఆ తర్వాత పాలేరులో పర్యటించి ఈ పథకాల గురించి వివరించి ప్రారంభించనున్నారు. ఈ పథకాలన్నీ సొంత డబ్బులతో షర్మిల అమలు చేస్తారని, వైఎస్సార్ టీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని నియోజకవర్గాలకు విస్తరిస్తామని ప్రచారం చేయాలనుకుంటున్నారు.
Also Read : ఇంతకీ వైఎస్ షర్మిల ఎవరు వదిలిన బాణం..?