ఎమ్మెల్యే సీతక్క. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. పేదల సంక్షేమం కోసం నిత్యం పాటుపడే సీతక్కను పార్టీలకతీతంగా అభిమానిస్తుంటారు. ములుగు నియోజకవర్గంలో సీతక్క అంటే ఎనలేని అభిమానం చూపే ప్రజలే ఆమె బలం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకునే సీట్లలో ముందు వరుసలో నిలిచే సీటుగా సీతక్క ప్రాతినిధ్యం వహిస్తోన్న ములుగు నియోజకవర్గం ఉంటుంది. అందుకే సీతక్క ఓటమి కోసం అప్పుడే కేసీఆర్ అండ్ కో ప్రణాలికలు సిద్దం చేస్తోంది.
సీతక్కకు అధికార పార్టీ నుంచి ఎన్నో ఆఫర్లు వచ్చాయి. మంత్రి పదవి ఆఫర్లు వచ్చాయి. ఆర్ధిక పరమైన ఆఫర్లు వచ్చాయి కాని వాటన్నింటికి సీతక్క నో చెప్తూ.. కాంగ్రెస్ తోనే కలిసి సాగుతున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో సీతక్కను ఓడించే నేత కోసం అన్వేషణలో పడ్డారు కేసీఆర్. ములుగులో సీతక్కను ఓడించే నేత బీఆర్ఎస్ నుంచి ఎవరూ లేరు. ఈ నేపథ్యంలో కేసీఆర్ చూపు ములుగులో పట్టు కల్గిన నేతపై పడింది.
ములుగు నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన ప్రస్తుత భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్యను కారెక్కించేందుకు చాలా ప్రయత్నాలే చేశారు. సీతక్కను ఓడించాలంటే వీరయ్యతోనే సాధ్యం అవుతుందని ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని బీఆర్ఎస్ నుంచి ఆఫర్లు వచ్చాయి. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుఫున గెలిస్తే మంత్రి పదవి ఇస్తామని కూడా ఆశ పెట్టారు. కాని ఆయన మాత్రం కాంగ్రెస్ ను వీడేది లేదని తేల్చేశారు.
సీనియర్ నేత రెడ్యా నాయక్ కుమార్తె మహబూబాబాద్ ఎంపీగానున్న కవితను లేదా ఎమ్మెల్సీగా మంత్రి పదవిని దక్కించుకున్న సత్యవతి రాథోడ్ ను ములుగుకు పంపాలని కేసీఆర్ భావిస్తున్నారు.ఈ ఇద్దరిలో ఉమ్మడి వరంగల్ బీఆర్ఎస్ నేతలు కవిత వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
Also Read : ఎమ్మెల్యేగా సీతక్క కొడుకు పోటీ..?