బీఆర్ఎస్ లో ప్రాధాన్యత లేక ఖమ్మం జిల్లా కారు నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవలి కాలంగా ధిక్కార స్వరాలు నిపిస్తున్నారు. ఒకేరోజు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి తిరుగుబాటు సంకేతాలు పంపడంతో అధిష్టానం అలర్ట్ అయినట్లు ఉంది. అసంతృప్తుల నోరును మొదట్లోనే మూయించకపోతే మరికొంతమంది నేతలు తిరుగుబాటు చేసేందుకు సిద్దం అవుతారని అంచనా వేసినట్లు ఉంది. అందుకే చర్యలకు ఉపక్రమించారు కేసీఆర్.
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తనను కలిసిన అనుచరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో పోటీ ఖాయమని, ఎక్కడ నుంచి.. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో చెప్పలేనని అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమని ప్రచారం జరిగింది. పొంగులేటి వ్యాఖ్యల సెగ ప్రగతి భవన్ కు తాకినట్లుంది. వెంటనే ఆయనకు కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
పొంగులేటికి కేసీఆర్ డైరక్ట్ వార్నింగ్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆయనకు ఉన్న సెక్యూరిటీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎస్కార్ట్ వాహనంతో కలిపి 3+3 సెక్యూరిటీ ఉంది. దీన్ని కేవలం 2+2 కుదించి పొంగులేటికి కేసీఆర్ గట్టి షాక్ ఇచ్చారు. పార్టీలో ఉంటూ అసంతృప్తి వ్యాఖ్యలు చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో గుర్తుంచుకోవాలని హెచ్చరించినట్లు ఈ నిర్ణయం ఉందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ లో గందరగోళం కనిపిస్తోంది. టికెట్ ఆశావహులు ఎక్కువ ఉండటంతో ఎవరికీ వారు టికెట్ నాదేనంటే నాదేనని వరుస ప్రకటనలు చేస్తున్నారు. జిల్లాలో బలమైన నేతలు తుమ్మల, పొంగులేటి శ్రీనివాస రెడ్డిలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండలేరు. బీఆర్ఎస్ లోనే కొనసాగితే సీటు దక్కదు అన్నట్లుగా పరిస్థితి ఉంది. దీంతో వారు పక్కచూపులు చూస్తున్నారు.ఈ విషయాన్నీ పసిగట్టి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆదిలోనే షాక్ ఇచ్చారు కేసీఆర్. దీంతో ఆయన కూడా రిటర్న్ షాక్ ఇచ్చేందుకు రెడీ ఆయ్యరని ఆయన అనుచరులు చెప్తున్నారు.
Also Read : తుమ్మల, పొంగులేటిలు కీలక వ్యాఖ్యలు – పార్టీ మార్పు ఖాయమా..?