ఖమ్మం కారులో అసంతృప్తులు మెల్లగా బయటకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. 2023 ఎన్నికల సంవత్సరం కావడంతో నూతన సంవత్సరం పురస్కరించుకొని బీఆర్ఎస్ పై అసంతృప్త నేతలు ధిక్కార స్వరం వినిపించారు. తమను పట్టించుకోకపోతే తమ దారి తాము చూసుకుంటామని అధినేతకు షాక్ లు ఇచ్చారు. ఇన్నాళ్ళు వేచి చూశామని ఇక ఓపిక లేదని చెప్పేశారు. అధిష్టానం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే సీనియర్ నేతలు ఎవరి దారి వారు చూసుకునే అవకాశం ఉంది.
కొత్త సంవత్సరం సందర్భంగా ఖమ్మం రూరల్ మండలం బారుగూడెం లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యాభై వేల మంది హాజరయ్యారు. ఈ ఆత్మీయ సమ్మేళనంతో మరోసారి తుమ్మల బల ప్రదర్శన చేసినట్లు అనిపించింది. ఇక వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి బరిలో ఉంటానని అనుచరులకు తుమ్మల స్పష్టం చేశారు. ఇది ఓ రకంగా పార్టీ అధినేతకు హెచ్చరికలు పంపడం లాంటిదే. ఎందుకంటే సిట్టింగ్ లకే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఆయన ప్రకటించినట్లుగానే సిట్టింగ్ లకే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తే తుమ్మలకు నిరాశ తప్పదు.
కందాల వర్సెస్ తుమ్మల నాగేశ్వర్
2018 ఎన్నికల్లో పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కందాల ఉపేందర్ ఆ తరువాత బీఆర్ఎస్ లో చేరారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుఫున నేనే బరిలో ఉంటానని కందాల తన అనుచరులతో చెప్పుకుంటున్నారు. కేసీఆర్ ప్రకటనే ఇందుకు తిరుగులేని సాక్ష్యమని చెప్పుకుంటున్నారు. గత ఎన్నికల్లో కందాలపై బీఆర్ఎస్ తరుఫున పోటీ చేసి ఓటమి పాలైన తుమ్మల కూడా పోటీకి సై అంటున్నారు. బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోయినా పోటీలో ఉంటానని చెప్తున్నారు. పార్టీలో ప్రాధాన్యత దక్కకపోవడంతో ఆయన బీఆర్ఎస్ ను వీడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ మధ్య పార్టీ నేతలు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి తుమ్మలను ఆహ్వానించలేదు. తన జిల్లాలో ఈ కార్యక్రమం జరిగినా తుమ్మలను ఆహ్వానించకపోవడంపై అధిష్టానం కూడా ఆరా తీయలేదు. దీంతో కేసీఆర్ పై తుమ్మల అసంతృప్తిగా ఉన్నారు. పిలిచి మాట్లాడితే సరేసరి లేదంటే పార్టీని వీడుతాననే విధంగా తుమ్మల కామెంట్స్ ఉన్నాయి.
మాజీ ఎంపీ పొంగులేటి ధిక్కారం
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపించారు. వచ్చే ఎన్నికల్లో తనతోపాటు తన అనుచరులు కూడా పోటీ చేస్తారని ప్రకటించారు. క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకలకు వచ్చిన కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. తాను గౌరవం కోసం ఖచ్చితంగా పోరాడుతానని, తనను నమ్ముకున్న వారిని ఇబ్బంది పెట్టనని స్పష్టం చేశారు.. ఇన్నాళ్లు ఓపికతో ఎదురు చూశానని, ఇక ఇప్పుడు ఆ పరిస్థితి లేదని స్పష్టం చేశారు. నేను ఊరుకున్నా కూడా కార్యకర్తలు ఊరుకోవడం లేదని ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది.
బానోత్ మదన్ లాల్ అసంతృప్తి
వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ కూడా కేసీఆర్ వ్యతిరేక స్వరం వినిపించారు. వైరా నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాల్లో క్యాంపు కార్యాలయాలు ప్రారంభించారు. 2018 ముందస్తు ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆయన మీద గెలిచిన రాములు నాయక్ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ లో చేరారు.. మొత్తానికి ముగ్గురు మాజీ ప్రజా ప్రతినిధులు అధికార టీఆర్ఎస్ పార్టీకి ధిక్కార స్వరం వినిపించడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నది.
Also Read : అంతర్గత సర్వేలో బీజేపీకి బిగ్ షాక్