సీనియర్ నటి సుధ అందరికీ తెలిసే ఉంటుంది. తెలుగు చిత్ర అభిమానులకు సుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమ్మ, వదిన క్యారెక్టర్ లకు ఆమె పెట్టింది పేరు. అందుకే ఆమెకు టాలీవుడ్ లో వందలాది చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
దర్శకుడు బాలచందర్ వలనే తాను ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో ఉండగాలిగానని చెప్పారు. మీరు హీరోయిన్ గా కంటే అమ్మ పాత్రలకు బాగా సెట్ అవుతారని ఆయన సూచించినట్లు తెలిపారు. కెరీర్ ప్రారంభంలో అమ్మ క్యారెక్టర్ లు చేస్తుంటే చాలామంది వద్దన్నారు. మొదట్లోనే ఆ పాత్రలు చేస్తే కెరీర్ మొత్తం అవే పాత్రలకు సెట్ చేస్తారని చాలామంది అన్నారని చెప్పుకొచ్చింది సుధ. కాని దర్శకుడు బాలచందర్ సూచన వలెనే తాను ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలదొక్కుకోగలిగానని చెప్పారు. మదర్ రోల్స్ చేయడం నేను ఆస్వాదించాను. ఏనాడూ అమ్మ పాత్రలు చేయాల్సి వస్తుందని బాధపడలేదని స్పష్టత ఇచ్చారు.
తాను నాలుగు తరాల హీరోలతో పని చేసినట్లు చెప్పారు సుధ. అందులో అందరికంటే జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమన్నారు. ఎన్టీఆర్ తన కుమారుడి లాంటి వారు. ఆ చనువు ఉండబట్టే ఎన్టీఆర్ ను మీరు అనకుండా వాడు అంటానని చెప్పారు. తారక్ తో సెట్స్ లో ఉన్న సమయంలో షూట్ అంత వినోదభరితంగా సాగుతుంది. తాను పెద్ద స్టార్ అనే అహం తారక్ లో అసలు కనిపించదు. అందరితో మింగిల్ అవుతాడు. ఎంత అల్లరివాడో అంతే హుందాగా మెలుగుతాడని చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్ గురించి చెప్తూనే ఆయనది ఎంత గొప్ప మనస్సో ఓ ఉదాహరణ చెప్పింది సుధ.
అన్నపూర్ణ స్టూడియోలో బాద్ షా మూవీ షూట్ జరుగుతుంది. నేను, ఎన్టీఆర్ కలిసి స్టేజ్ మీద డాన్స్ చేసే సీన్ అది. ఒక టేక్ అయ్యాక నేను మరో టేక్ చేద్దామన్నాను. బాగానే వచ్చిందిగా ఎందుకన్నాడు ఎన్టీఆర్. లేదు ఇంకో టెక్ చేయాల్సిందేనని అన్నాను. రెండో టెక్ చేస్తుండగా నా కాలు బెనికింది. వెంటనే ఎన్టీఆర్ పరుగెత్తుకొచ్చి నా కాళ్ళు పట్టుకున్నాడు. ఎం జరిగిందో చూసి ఫస్ట్ ఎయిడ్ గా గాయమైన చోట స్ప్రే కొట్టారు. అంత పెద్ద స్టార్ నాలాంటి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ విషయంలో అలా స్పందించాల్సిన అవసరం లేదు. మూవీ యూనిట్ కి చెబితే సరిపోతుంది. తారక్ అలా కాకుండా స్వయంగా నా కాళ్ళు పట్టుకొని ఫస్ట్ ఎయిడ్ చేయడం అతని గొప్ప మనస్సుకు మచ్చు తునక అన్నారు.
Also Read : సరికొత్త రికార్డ్ నెలకొల్పిన ప్రభాస్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్