ఏపీ సీఎం జగన్ ఇటీవలి ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో కేంద్ర పెద్దలతో జగన్ భేటీ అయ్యారు. ఏపీ సమస్యలపై చర్చించేందుకే ఈ భేటీ జరిగిందని అంటున్నా..ముందస్తు ఎన్నికలపై చర్చించారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా.. గత కొంతకాలంగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు తథ్యమేనన్న అభిప్రాయాలు వస్తున్నాయి. ఏపీ సర్కార్ వ్యూహాలను పసిగడుతోన్న చంద్రబాబు ముందస్తుకు టీడీపీ నేతలను రెడీ చేస్తున్నారు. ఆయన జనాల్లో ఉండేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
వైసీపీకి పోటీగా టీడీపీ కూడా ముందస్తు ఎన్నికల దృష్టిలో పెట్టుకొని దూకుడు కొనసాగిస్తోంది. దీంతో టీడీపీని సైడ్ చేయాలని అనుకుంటున్నారో ఏమో కాని, ముందస్తు ముచ్చటే లేదని వైసీపీ చెబుతోంది. షెడ్యూల్ మేరకే ఎన్నికలు జరుగుతాయంటోంది. కాని వైసీపీ వాలకం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంతో ఇంటింటికి వెళ్తున్నారు. మార్చిలో ఈ కార్యక్రమం ముగియనుంది. అప్పుడే టికెట్లు కూడా ప్రకటిస్తామని జగన్ స్పష్టం చేశారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తోన్న విపక్షాలు ఆరు నెలల తర్వాత ముందస్తు ప్రకటన ఖాయమని అంచనా వేస్తున్నాయి.
ముందస్తుకు వెళ్ళాలంటే జగన్ కు కేంద్రం సహకారం కావాలి. కేంద్రం పర్మిషన్ తీసుకోకుండా అసెంబ్లీని రద్దు చేస్తే రాష్ట్రపతి పాలన విధిస్తుంది. అందుకే జగన్ తాజా హస్తిన పర్యటనలో ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో ముందస్తు విషయమై చర్చలు జరిపారని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో నానాటికీ ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోంది. ఈ పరిస్థితులను అంచనా వేసే ముందస్తుకు వెళ్లాలని జగన్ భావిస్తున్నారు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్ళినప్పుడు ఎందుకు ముందస్తుకు వెళ్తున్నారో ప్రకటించారు. ఇప్పుడు జగన్ కూడా ముందస్తు వెళ్తే.. ఎందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారో స్పష్టం చేయాల్సి ఉంటుంది. అందుకు చెప్పే రీజన్ ప్రజలను సంతృప్తి పరచగలగాలి. ముందస్తుపై జగన్ చెప్పే కారణానికి జనాలు కన్విన్స్ కాకపోతే ముందస్తు మిస్ ఫైర్ అయి వైసీపీనే కాటేస్తుంది.