ఇంట్లో సందడి, సందడి చేసే పిల్లాడికి ఉన్నట్టుండి విరేచనాలు అయ్యాయి. ఆ తరువాత వాంతులు కూడా కావడంతో వెంటనే పిల్లాడిని ఆసుపత్రికి తీసుకెళ్ళారు తల్లిదండ్రులు. చికిత్స పొందుతునే ఆ పిల్లాడు కన్నుమూశాడు. కొడుకును పోగొట్టుకున్న దుఖంలో ఉండగానే కూతురికీ విరేచనాలు ఆయ్యాయి. దీంతో వెంటనే ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలిస్తుండగా వాంతులు చేసుకుంది. ఆసుపత్రిలో చేర్చిన రెండు రోజుల తరువాత తను కూడా కన్నుమూసింది. ఒకరెంట మరొకరు ఆ పిల్లలు చనిపోవడంతో వారి తల్లిదండ్రుల కన్నీటిని ఆపడం ఎవరి తరం కాలేదు.
వారికొచ్చిన ఆపద చూసి ఊరు, ఊరంతా కంటతడి పెట్టింది. వారితో కలిసి దుఃఖాన్ని పంచుకుంది ఆ ఊరు. పిల్లలు లేరన్న బాధలో ఉండగా పది రోజుల తరువాత తల్లి కూడా అనారోగ్యం పాలయింది. అవే లక్షణాలతో ఉండగా ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. రెండు రోజుల తరువాత ఆమె కూడా తుది శ్వాస విడిచింది. ఆ తరువాత భార్యా, పిల్లల వెంటే వెళ్ళిపోయాడు భర్త. 45రోజుల వ్యవధిలోనే కుటుంబ సభ్యులందరూ కన్నుమూయడం ఆ ఊరిని కన్నీరు పెట్టించింది.
ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వీరి మరణాలకు కారణం ఏంటన్నది తెలియరాలేదు. గంగాధర మండలకేంద్రానికి చెందిన శ్రీకాంత్, ఆయన భార్య మమత, కూతురు అమూల్య, కుమారుడు అద్వైత్.. అంతుచిక్కని వ్యాధితో చనిపోయారు. వాళ్ళ మరణాలకు కారణం ఏంటో తెలుసుకునేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. మృత దేహాల నుంచి రక్త నమూనాలు సేకరించి హైదరాబాద్ పంపించారు. వైద్యులు పరీక్షించిన అనంతరం వీరి మరణానికి కారణం ఏంటన్నది తేలనుంది.
Also Read : బిగ్ బాస్ హౌజ్ లో గబ్బు గబ్బు – లిప్ కిస్ తో కంటెస్టెంట్స్