నాస్తికుడైన బైరి నరేష్ హిందూ దేవుళ్ళపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అశ్లీల అసభ్య పదాలతో హిందూ దేవుళ్ళను వర్ణించడంతో హిందుత్వ సంఘాలు రచ్చకెక్కాయి. బైరి నరేష్ పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని, వెంటనే అరెస్ట్ చేయాలని తెలంగాణ వ్యాప్తంగా అయ్యప్ప స్వాములు ఆందోళన చేపట్టారు.
ఇక ఈ విషయంలో కొంతమంది బైరి నరేష్ ను సమర్దిస్తుండగా.. మరికొంతమంది ఆయనను తప్పుబడుతున్నారు. నిజానికి , బైరి నరేష్ హద్దు మీరి మాట్లాడారు. ఆయన నాస్తికుడు. అంటే దేవుళ్ళను విశ్వసించరు. అయినంత మాత్రానా దేవుళ్ళను అసభ్య పదాలతో వర్ణించడం తప్పుడు కాదా..?అంటే తప్పే. ఆయన చెప్పాలనుకున్నది మరో విధంగా కూడా చెప్పొచ్చు. కాని వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన అసభ్య పదాలను వాడుతూ మాట్లాడారు.
రాష్ట్రంలో చాలామందే నాస్తికులు ఉన్నారు. వారందరూ రాజ్యాంగానికి లోబడి తమ ఆలోచనను ప్రజల ముందు ఉంచుతారు. కాని బైరి నరేష్ మాత్రం గీత దాటి మరీ మాట్లాడేశారు. రాజ్యాంగం భావ ప్రకటన హక్కు కల్పించింది కదా అని ఏదీ పడితే అది మాట్లాడతామంటే కుదరదు. అంబేద్కర్ ను విశ్వసిస్తామని చెప్పే నరేష్ కు ఈ విషయం తెలియనిది కాదు. అయినా కూడా భావ ప్రకటన స్వేఛ్చ పేరుతో దేవుళ్ళను తూలనాడటం సరైంది కాదు. ఆయన వర్షన్ లో ఆయన మాట్లాడింది కరెక్ట్ కావొచ్చు.
కాని కోట్లాది మంది ఆరాధించే అయ్యప్ప స్వామిపై అశ్లీలతతో కూడిన పదాలతో దాడి చేయడం మాలధారణ వేసిన స్వాములకు నచ్చలేదు. ఇక్కడే ఆయన పొరపాటు చేసినట్లు అనిపించింది. దీంతో అయ్యప్ప స్వాములు రోడ్డెక్కారు. అయ్యప్ప స్వామిపై నరేష్ వ్యాఖ్యలు తప్పని భావిస్తే ఎందుకు తప్పో వివరించే ప్రయత్నం చేయాల్సింది. గతంలో పెరియర్ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడని హిందుత్వ సంఘాలు మాట్లాడితే ఏ నాస్తికుడూ వాళ్లపై దాడి చేయలేదు. సరికదా “ఆయనకు పిల్లలే లేరు” అనే సత్యాన్ని సమాధానంగా చెప్పారు. వారిలాగే వాస్తవాలను హిందుత్వ సంఘాలు కూడా జనాలకు చెప్తే బాగుండేది. ఆ ప్రయత్నం అయ్యప్ప స్వాములు, హిందుత్వ సంఘాలు చేయలేదు.
అశ్లీల పదాలను అలా పచ్చిగా ఉపయోగిస్తూ బైరి నరేష్ మాట్లాడటం చాలామందికి నచ్చలేదు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ఆయన చేసిన కార్యక్రమాలు చూసి స్ఫూర్తి పొందిన వారు సైతం దేవుళ్ళపై నరేష్ వాడిన పద ప్రయోగాన్ని తప్పుబడుతున్నారు. అదే సమయంలో ఆయన ఆలోచనతో ఏకీభవించే వ్యక్తిపై దాడి చేయడం. ఆ ఆలోచన కల్గిన వారిపై దాడి చేసి తీరుతామని హిందుత్వ సంఘాలు ప్రకటించడం కూడా తప్పే. అన్నింటికి దాడులు, ప్రతి దాడులు పరిష్కారం అవుతే ఇక పోలీసులు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు..? బైరి నరేష్ మాట్లాడిన వ్యాఖ్యలు కించపరిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అంతేకాని, తమ విశ్వాసాలు దెబ్బతీశాడని దాడులకు దిగితే వాదనలో పస లేకుండా పోతుంది.
హిందూ దేవుళ్ళపై చాలామంది నోరు పారేసుకుంటున్నారు. దేవుడు ఉన్నాడా..? లేడా..? అనేది వారి, వారి వ్యక్తిగత అభిప్రాయాలకు సంబంధించిన అంశం. ఎదుటి వారి విశ్వాసాలను గౌరవించాలి. దేవుడు ఉన్నాడని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అంత మాత్రానా కోట్లాది మంది ఆరాధించే దేవుళ్ళపై అసభ్య పదాలతో విరుచుకుపడటం ఎంతమాత్రం సమర్ధనీయం కాదు.
ఇకపోతే, ఈ అంశాన్ని బీజేపీ అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తోంది. రాజాసింగ్ , బండి సంజయ్, ఎంపీ అరవింద్ లు బైరి నరేష్ పై మండిపడుతూ..ఇలాంటి వాళ్ళ నోటికి తాళం పడాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సి ఉందంటూ ఈ సున్నిత అంశంలోకి రాజకీయాన్ని చొప్పించారు. దీంతో హిందుత్వ కార్డుతో రాష్ట్రంలో అగ్రెసివ్ రోల్ పోషించేందుకు బీజేపీకి మరో అవకాశం అంబేద్కర్ వాదులే కల్పించడం విషాదం.