తమ పార్టీ ఎమ్మెల్యేలను డబ్బులు, పదవులతో బీజేపీలో చేర్చుకునేందుకు ప్రలోభాలకు గురి చేశారని కేసీఆర్ ఆరోపిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా ఈ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఆడియో , వీడియోలను బయటపెట్టడంపై సీబీఐ కేసీఆర్ ను ప్రశ్నించనుంది.
అలాగే, బీజేపీలో చేరుతామంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎలాంటి ఆఫర్ చేశారో , తమ పార్టీ తరుఫున గెలిచి బీఆర్ఎస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు దాదాపు అలాంటి ఆఫర్స్ ఇచ్చి కేసీఆర్ కొనుగోలు చేశాడని రేవంత్ ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును ఎలాగైతే సీబీఐకి అప్పగించారో..తమ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి ఫిరాయించడానికి కేసీఆర్ చేకూర్చిన ప్రయోజనాలను బయటపెట్టేలా విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read : కేసీఆర్ రాజ్యంలో మాయమైపోతున్న తెలంగాణం
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారు. వీరికి కేసీఆర్ పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనాలు, పదవులు కల్పించారని ఆరోపిస్తున్నారు. ఇది కూడా ప్రలోభ పెట్టడమేమనని అంటున్నారు. ఈ ఫిరాయింపులపై కూడా విచారణ జరగాలని, ఈమేరకు సీబీఐకి ఫిర్యాదు చేయాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి. ఈమేరకు ఈ విషయమై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. మొదట హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఆ తరువాత సీబీఐకి కంప్లీట్ చేయాలనుకుంటున్నారు.
బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎలాంటి లబ్ది చేకూరిందో వివరాలన్నీ రేవంత్ సేకరించారు. వాటన్నింటిని సీబీఐకి ఇచ్చి విచారణను కోరనున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోనున్న నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు ఫిరాయింపు ఎమ్మెల్యేలే. వీరికి కేసీఆర్ ఆర్థికంగా లబ్ది చేకూర్చారని రేవంత్ ఆరోపిస్తునారు. కాంగ్రెస్ తరుఫున గెలిచి బీఆర్ఎస్ లో చేరిన సబితా ఇంద్రారెడ్డి మంత్రి అయ్యారు. ఇదంతా ఒప్పందంలో భాగంగానే జరిగిందని రేవంత్ అంటున్నారు.
Also Read : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు : కేసీఆర్ కు ఇక చుక్కలే..!
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును దర్యాప్తు చేయనున్న సీబీఐ ఈ అంశంపై కూడా దృష్టి సారిస్తే కేసీఆర్ మరింత ఇరుకున పడటం ఖాయం.