టీమిండియా చిచ్చరపిడుగు, వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన ప్రయాణిస్తోన్న కారు డివైడర్ ను డీకొట్టడంతో క్షణాల్లోనే కారులో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో కారును పంత్ డ్రైవ్ చేస్తున్నాడు.
ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి మెర్సిడెస్ బెంజ్ కారులో పంత్ ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన జరిగినప్పుడు కారులో పంత్ మాత్రమే ఉన్నాడని ఉత్తరాఖండ్ డీజీపీ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగాయని.. దీంతో కారు అద్దాలను ధ్వంసం చేసి పంత్ బయటకొచ్చాడని తెలిపారు.
పంత్ ప్రయాణిస్తోన్న కారు ప్రమాదానికి గురైన ఘటనలో పంత్ తలకు, మోకాలికి గాయాలయ్యాయి. వీపు భాగం కాలినట్లు తెలుస్తోంది. కాలికి ఫ్రాక్చర్ అయింది. మొదట పంత్ ను రూర్కీ ఆసుపత్రికి తరలించగా ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం డెహ్రాడూన్ లోని ఆసుపత్రికి తరలించారు. కారు నడుపుతున్న సమయంలో పంత్ నిద్రలోకి జారుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.
ఏదీ ఏమైనా, పంత్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆయన త్వరగా కోలుకోవాలని క్రికెట్ అభిమానులు కోరుతున్నారు. పంత్ త్వరగా కోలుకోవాలని టీమిండియా మాజీ క్రికెటర్లు సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్ లు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకగానే ఉందని వైద్యులు వెల్లడించారు.