ఎన్నికలు సమీపిస్తున్నాయి. రైతుల్లో బీఆర్ఎస్ ప్రభుతంపై అసంతృప్తి తీవ్రం అవుతోంది. ఇన్నాళ్ళు బీఆర్ఎస్ ను ఆదరించిన రైతాంగం వరంగల్ డిక్లరేషన్ తరువాత క్రమంగా కాంగ్రెస్ వైపు మొగ్గుతోంది. అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించడం రైతులను ఆకర్షిస్తోంది. రెండో దఫా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని 2018 ఎన్నికల్లో హామీ ఇచ్చింది.
అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు అవుతోన్నా ఆ హామీ ఇప్పటికీ నెరవేర్చలేదు. ఈ నేపథ్యంలో రుణమాఫీ జరగక బ్యాంక్ సిబ్బంది వేధింపులు తాళలేక వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సకాలంలో రైతు రుణమాఫీ జరగకపోవడంతోనే అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కేసీఆర్ సర్కార్ పై రైతాంగం తీవ్ర ఆగ్రహంతో ఉంది. దీంతో ఎన్నికల సంవత్సరమైన 2023లో రైతు రుణమాఫీ చేసి తీరాలని కేసీఆర్ భావిస్తున్నారు. లేదంటే రైతుల ఆగ్రహాన్ని ఎన్నికల్లో ఎదుర్కోవాల్సి వస్తుందన్నది కేసీఆర్ భయం. దాంతో వచ్చే ఏడాదిలో రైతు రుణమాఫీ చేసే అవకాశం కనిపిస్తోంది.
2018 డిసెంబర్ లో రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2021ఆగస్టులో జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు దఫాలుగా రుణమఫీ చేయాలనీ నిర్ణయించారు. 36.8లక్షల మంది రైతు రుణమాఫీ కోసం 25 వేల కోట్లు అవసరం అవుతాయి. ఈ మొత్తాన్ని ఒకేసారి ఇవ్వడం కష్టమని భావించి విడతల వారీగా రుణమాఫీ చేస్తామని చెప్పారు.
మొదటి దశలో 25,000, రెండో దశలో 50,000, ఆపై రెండో విడతల్లో 75,000, లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాని ఇప్పటివరకు రుణమాఫీ సక్రమంగా అమలు కాలేదు. తూతూ మంత్రంగా రెండు దశల్లో రుణమాఫీ చేయగా కొంతమందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. చాలామందికి రుణమాఫీ అవ్వలేదు. దీంతో రైతుల్లో సర్కార్ పై ఆగ్రహం నానాటికీ పెరిగిపోతుంది.
ఈ నేపథ్యంలోనే రైతు రుణమాఫీ చేయకుండా ఎన్నికలకు వెళ్తే ప్రతిపక్షాలు ఈ అంశాన్ని ప్రచారస్త్రంగా చేసుకుంటాయి. ప్రధానంగా కాంగ్రెస్ కు ప్లస్ అవుతుంది. దీనిని పసిగట్టిన కేసీఆర్ రైతు రుణమాఫీని 2023లో చేయాలని భావిస్తున్నారు. కొత్త సంవత్సరం కానుకగా లక్ష రూపాయల రుణమాఫీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సారి నగదు రూపంలో కాకుండా చెక్కుల రూపంలో నగదును అందజేయనునట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.