ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ పై కోపం కట్టలు తెంచుకుంది. సిరిసిల్లలో జరిగిన సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ క్లీన్ స్విప్ చేసి బీజేపీని మట్టికరిపించింది. దీనిపై కేటీఆర్ మాట్లాడుతూ..తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని తేలిపోయిందని వ్యాఖ్యానించారు. ఇది సోము వీర్రాజు చూసి కేటీఆర్ పై విరుచుకుపడ్డారు. కేటీఆర్ ఏపీకి చెందిన వ్యక్తి కాకపోయినా పార్టీని అంటే ఊరుకుంటానా అనుకున్నారో ఏమో కాని సోము వీర్రాజు తీవ్రస్థాయిలో ఊగిపోయారు.
వైసీపీ ప్రభుత్వం ఎస్సీ పథకాలు రద్దు చేసిందని గుంటూరులో బీజేపీ చేపట్టిన ధర్నాలో సోము వీర్రాజు పాల్గొని మాట్లాడారు. సీఎం జగన్ పై విమర్శలు చేసి ఆ తరువాత కేటీఆర్ పై కూడా రెచ్చిపోయారు. కేటీఆర్ మాట్లాడితే కేసీఆర్ మాట్లాడినట్టే ఉందన్నారు. కుటుంబ పార్టీలన్ని అబద్దాలే మాట్లాడుతాయన్నారు. కూతురు, కుమారుడు అందరూ అబద్దాలు మాట్లాడుతారని..ఇలా నాతో కేటీఆర్ మాట్లాడితే కడిగి పారేస్తానన్నారు. దమ్ముంటే తనతో చర్చకు రావాలంటూ సవాల్ చేశారు. కేటీఆర్ ది నోరా తాటిమట్టా అని మండిపడ్డారు.
సోము వీర్రాజు ఆవేశం చూసి ఆ పార్టీ నేతలు సైతం ఆశ్చర్యపోయారు. అసలు ధర్నా ఎందుకు నిర్వహిస్తున్నారు..సోము సార్ ఎం మాట్లాడుతున్నారంటూ వారిలో వారే గొనుక్కున్నారు. ఇప్పటికప్పుడు కేటీఆర్ పై సోము వీర్రాజుకు అంత కోపమెందుకు వచ్చిందన్నది బీజేపీ నేతలకు అర్థం కాలేదు.