ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టాలని హైకోర్టు ఆదేశించడంతో టీఆర్ఎస్ తెగ ఇదైపోతుంది. కేంద్రాన్ని దోషిగా చూపించి కేసీఆర్ పొందాలనుకున్న మైలేజ్ హైకోర్టు తీర్పుతో నీరుగారిపోయినట్లైంది. కేంద్రంపై మాపై దర్యాప్తు సంస్థలను వదిలితే తామేమి తక్కువ కాదని కేసీఆర్ చూపిన ధైర్యం ఇప్పుడు సన్నగిల్లిపోనుంది.
Also Read : టి. బీజేపీలో సీఎం చైర్ కొట్లాట – డీకే అరుణ వర్సెస్ ఈటల
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించిన వెంటనే ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. ఈ కేసును సీబీఐకి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తను జైలుకు వెళ్లేందుకు కూడా రెడీగా ఉన్నానని ప్రకటించారు. అసలు ఈ కేసులో నగదు చెల్లింపులే జరగలేదని అలాంటప్పుడు ఈడీ ఎలా ఎంటర్ అవుతుందని ప్రశ్నించారు. ఆయన గంభీరంగా ఈ ప్రకటనలు చేసిన పైలెట్ లో మాత్రం ఆందోళన కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇది పైలెట్ రోహిత్ రెడ్డి ఒక్కడి ఆందోళనే కాదు బీఆర్ఎస్ నాయకత్వం కూడా ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మొత్తం పైలెట్ రోహిత్ రెడ్డి చుట్టే తిరుగుతోంది. పార్టీ మారితే వందకోట్లు ఇస్తామని.. నందకుమార్ ద్వారా బీజేపీ పెద్దలు ప్రలోభపెట్టారని రోహిత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే, ఈ నందకుమార్ ఎవరో కాదు. రోహిత్ రెడ్డి వ్యాపారాల్లో భాగస్వామిగా ఉన్నారు. దీంతో అసలు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బయటకు తెలిసింది కొంతే.. తెలియాల్సిందే చాలా ఉన్నట్లు అర్థం అవుతోంది. ఎమ్మెల్యేలతో బేరసారాల ఇష్యూ బయటపడిన రోజు 15కోట్లు దొరికినట్లు ప్రచారం జరిగింది. కాని తరువాత ఆ డబ్బులు ఎక్కడ చూపించలేదు. ఒకవేళ ఆ డబ్బులు చూపించి ఉంటె..ఈ వ్యవహారంలోకి ఈడీ ఎప్పుడో ఎంటర్ అయి ఉండేది కాబట్టి ఈడీని ఇన్వాల్వ్ చేయకుండా ఉండేందుకే ఆ పదిహేను కోట్లను మాయం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ ఈడీ వ్యూహాత్మకంగా ఈ కేసును తన చేతుల్లోకి తీసుకుంది. తాజాగా సీబీఐ కూడా రంగంలోకి దిగబోతోంది.
Also Read : ఆ నలుగురికి కేసీఆర్ బిగ్ షాక్ – మంత్రివర్గం నుంచి ఔట్
ఈ కేసులో సీబీఐ విచారణ జరుగుతుండటంతో కోణం మారిపోయే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. సిట్ రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నలో పని చేస్తే.. సీబీఐ బీజేపీకి అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసులో సీబీఐ విచారణ ప్రారంభం కానుండటంతో నలుగురు ఎమ్మెల్యేలను ప్రశ్నించనుంది. ఎవరు ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రయత్నించారు..? వారిని ఎవరు అప్రోచ్ అయ్యారు.? నలుగురు జట్టు కట్టడానికి కారణం ఏంటి..? అనే అంశాలను సీబీఐ విచారణలో తేల్చనుంది. ఇప్పటివరకు ఒకే వైపు నుంచి విషయాలు వెలుగు చూడగా..సీబీఐ ఎంట్రీతో మరో కోణం కూడా బయటపడే అవకాశం కనిపిస్తోంది.