ధనవంతుల కుటుంబంలో ఏదైనా వేడుక నిర్వహిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని మరీ వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. అంబానీ లాంటి ధనవంతుల కుటుంబంలో వేడుక జరిగితే ఆషామాషీగా నిర్వహిస్తారా..? అసలే ఎక్కడ తగ్గేదేలే అన్నట్లుగా వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ముఖేష్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ ఇటీవల అమెరికాలో కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇద్దరు కవలల్లో ఒకరు మగ శిశువు మరొకరు ఆడ శిశువు. వీరికి కృష్ణ, ఆద్య అని నామకరణం చేశారు. తల్లి అయిన తరువాత మొదటి సారి ఈషా అంబానీ ఇండియాకు వస్తున్నారని అంబానీ ఫ్యామిలీ లోకమే ఆశ్చర్యపడిపోయే విధంగా ఏర్పాట్లు చేస్తోంది.
అమెరికా నుంచి వచ్చిన తమ మనవడు, మనవరాలికి ఘన స్వాగతం పలికింది అంబానీ ఫ్యామిలీ. వీళ్ళు ముంబై వచ్చేందుకు ఖతార్ ఎయిర్ వేస్ ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. అంతేకాదు.. ప్రయాణ సమయంలో కవలలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేలా అమెరికాలో ఫేమస్ పీడియాట్రిషియన్ గిబ్సన్ నేతృత్వంలోని వైద్య బృందం వీరితో పాటు ముంబై వచ్చింది.
వీరు ఇండియాకు వచ్చిన సందర్భంగా డిసెంబర్ 25న ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పెద్ద మొత్తంలో విరాళాలు ఇవ్వనున్నారట. ప్రముఖ దేవాలయాలకు చెందిన పూజారులను పిలిచి అంబానీ మనవడు, మనవరాలుకు ఆశీర్వాదం ఇప్పించనున్నారు. అంతేకాదు, మూడు వందల కేజీల బంగారం దానం చేయనున్నట్లు తెలుస్తోంది.