టాలీవుడ్ ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ(87) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కరోనా సమయంలోనే ఆయన తీవ్ర అస్వస్థతకు గురై మరణం అంచుల వరకు వెళ్లి వచ్చారు. ఆ తరువాత ఆరోగ్యం కుదుటపడింది. ఈ మధ్య మళ్ళీ ఆరోగ్యం క్షీణించడంతో కన్నుమూశారు. శనివారం హైదరాబాద్ లో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు జరుగుతాయి.
నటన రంగంలో కైకాల చెరగని ముద్ర వేశారు. చిత్ర పరిశ్రమతో 60ఏళ్ల అనుబంధంలో 777సినిమాలో నటించారు. పాత్ర ఏదైనా అందులో ఒదిగిపోవడం ఆయన ప్రత్యేకత. హాస్యం పండించడం కావొచ్చు, విలనిజం చూపించడం కావొచ్చు, అగ్రెసివ్ రోల్ పోషించడం కావొచ్చు. ఇలా క్యారెక్టర్ ఏదైనా అందులో ఒదిగిపోవడం కైకాలకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఆయన నవరస నటనా సార్వభౌముడు అయ్యాడు.
ఎన్టీఆర్ తరువాత అంతటి పేరు, ప్రఖ్యాతలు పొందిన నటుడు కైకాలనే. రాజకీయాల్లోనూ రాణించారు. 1996లో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి లోక్ సభకు ఎన్నికయ్యారు. 1998 ఎన్నికల్లో ఓటమి తరువాత రాజకీయాలకు దూరం అయ్యారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున మరోసారి మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి కానీ జరగలేదు. ఎన్నడూ వివాదాల్లో తలదూర్చలేదు. వివాదరహితుడిగా , చిత్ర పరిశ్రమ మొత్తం అభిమానించే నటుడిగా నిలిచారు కైకాల.
ఇటీవలే సూపర్ స్టార్ ను కోల్పోయిన తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడు దిగ్గజ నటుడు కైకాలను కూడా కోల్పోవడంతో టాలీవుడ్ తీవ్ర విషాదం లో మునిగిపోయింది.