టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయ్యాక టీడీపీపై ఆంధ్ర పార్టీ అనే ముద్ర వేసే అవకాశం లేకుండా పోయింది. దాంతో తెలంగాణలో టీడీపీ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. గతంలో పార్టీని వీడిన నేతలను తిరిగి రావాలని చంద్రబాబు కబురు పంపుతున్నారు. ఫోన్లు చేసి స్వయంగా ఆహ్వానం పలుకుతున్నారు. ఈమేరకు బుధవారం ఖమ్మంలో జరిగిన సభ వేదిక నుంచే టీడీపీ పాత నేతలను ఆహ్వానించారు. తెలంగాణలో టీడీపీని నేతలే వీడారు కాని, ఆ పార్టీ క్యాడర్ మాత్రమే అలాగే ఉందని సభకొచ్చిన జనసందోహం రుజువు చేసింది. చంద్రబాబు ఖమ్మం పర్యటన ఊహించని విధంగా సక్సెస్ కావడంతో రాజకీయ వర్గాల్లో ఓ కొత్త చర్చ ఊపందుకుంది.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ ల మధ్య పొత్తు ఉండనున్నట్లు వార్తలొస్తున్నాయి. తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ టార్గెట్ గా పెట్టుకుంది. అయితే కమలం పార్టీకి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా సరిగా లేరు. ఈ మూడు జిల్లాలో టీడీపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉండటంతో టీడీపీతో పొత్తు అంశాన్ని బీజేపీ అంగీకరించే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ , టీడీపీతో పొత్తు పెట్టుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేం. అందుకే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంపై చంద్రబాబు ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో కొనసాగుతు స్తబ్దుగానున్న నేతలను యాక్టివ్ చేయడంతోపాటు, పార్టీని వీడిన నేతలను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు బాబు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ లో కొనసాగుతూ సీనియర్ నేతల తీరుతో అసంతృప్తితోనున్న నేతలను టీడీపీలోకి లాగేందుకు చూస్తున్నారు. తద్వారా బీజేపీ దృష్టిని చంద్రబాబు ఆకర్షించే అవకాశం మెండుగా ఉంది.
2023లో తెలంగాణలో జరిగనున్న సాధారణ ఎన్నికల్లో బీజేపీ టీడీపీ మద్దతును కోరితే, ఏపీలోనూ కలిసి వస్తుందని చంద్రబాబు భావిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే, ఏపీలో టీడీపీ ఒంటరిగా పోటీ చేసి అధికారంలో వచ్చే అవకాశం లేదు. బీజేపీ, జనసేన పొత్తుతో 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ…మరోసారి బీజేపీ, జనసేన మైత్రి కోసం చేతులు చాస్తోంది. అప్పట్లో ప్రత్యేక హోదా డిమాండ్ తో కేంద్ర మంత్రివర్గంలోనుంచి టీడీపీ బయటకు రావడంతో బీజేపీ అధినాయకత్వంతో చంద్రబాబుకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఇప్పుడు ఆ సంబంధాలను పునరుద్దరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీలో పొత్తుకు తెలంగాణ పునాది వేస్తుందని చంద్రబాబు భావిస్తున్నట్టే…తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు టీడీపీతో పొత్తు లాభిస్తుందని బీజేపీ అనుకోవచ్చు. బీజేపీతో చెలిమి వలన ఏపీలోనూ ప్రయోజనం ఉంటుందనే ద్విముఖవ్యూహంతో బాబు ఉన్నట్టు తెలుస్తోంది.