తెలంగాణ కాంగ్రెస్ లో ఏర్పడిన సంక్షోభాన్నికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ కు వచ్చారు. తొమ్మిది మంది సీనియర్ నేతలతో సమావేశమై వారి అసంతృప్తిపై చర్చించనున్నారు. ఎలాగైనా వారిని శాంతింపజేసేలా చొరవ తీసుకోవాలని అధిష్టానం దిగ్విజయ్ సింగ్ ను పంపింది. అయితే, తమ అసమ్మత్తిని గుర్తించి దూతను పంపుతుండటంతో సీనియర్లు మరి బెట్టు చేసే అవకాశం ఉంది. టీపీసీసీ చీఫ్ ను మార్చాలని సీనియర్లు పట్టుబట్టే అవకాశం కనిపిస్తోంది.
బుధవారమే ఢిల్లీలో దిగ్విజయ్ సింగ్ ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కలిశారు. పార్టీలో ఏర్పడిన వర్గపోరుపై తన వాదనను వినిపించారు. సీనియర్ల వ్యవహారశైలి, ఇతర పార్టీ నేతలతో టచ్ లో ఉండటం, సొంత పార్టీకి తలనొప్పులు తెచ్చేలా పదేపదే ప్రకటనలు చేయడం వంటి అంశాలపై డిగ్గీ రాజాకు రేవంత్ రిపోర్ట్ ఇచ్చినట్లు సమాచారం.
దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ పర్యటనపై రేవంత్ వర్గం ఆందోళనేమి చెందటం లేదు. రేవంత్ వ్యతిరేక వర్గమైన సీనియర్లు దిగ్విజయ్ సింగ్ వద్ద తమ వాదనను గట్టిగా వినిపించేందుకు సిద్దమయ్యారు. అయితే, వారి వాదన ఎలా ఉండనుందన్నది ఆసక్తికరంగా మారింది. టీపీసీసీ నూతన కమిటీలో 58మంది టీడీపీ నేతలు ఉన్నారని ఉత్తమ్ చెప్తున్నారు. ఇది పచ్చి అబద్దం. మరెలా టీపీసీసీ కమిటీ కూర్పుపై దిగ్విజయ్ సింగ్ కు ఫిర్యాదు చేస్తారో చూడాలి.
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో సీనియర్ల వాదనను అధిష్టానం పట్టించుకునే పరిస్థితి లేదు. ఒకేసారి తొమ్మిది మంది సీనియర్లు అసంతృప్తి రాగాలు వినిపించడం వల్లే దిగ్విజయ్ సింగ్ ను దూతగా పంపుతుంది. ఇరు వర్గాలకు నచ్చజెప్పి పరిస్థితిని చక్కదిద్దాలని సూచించింది. తప్ప మరో వర్గంపై వేటు వేసే పరిస్థితి లేదు.
పీసీసీ చీఫ్ రేవంత్ కు సహకరించాల్సిందేనని అధిష్టానం మాటగా సీనియర్లకు దిగ్విజయ్ సింగ్ సూచించే అవకాశం ఉంది. అందుకే ముందుగా రేవంత్ వాదనను దిగ్విజయ్ సింగ్ విన్నట్లు తెలుస్తోంది. పార్టీకి విధేయులుగా పని చేయాలని సీనియర్లకు దిగ్విజయ్ సింగ్ హితబోధ చేయనున్నారు. పార్టీకి నష్టం కల్గించేలా వ్యవహరించవద్దని బ్రెయిన్ వాష్ చేసి సంక్షోభానికి ముగింపు పలకనున్నారు.