తగ్గేదేలేదన్న మంత్రి మల్లారెడ్డి ఎట్టకేలకు తగ్గారు. అధిష్టానం క్లాస్ పీకిందో లేక పశ్చాతాపం చెందారో కాని క్రమశిక్షణ సందేశం వినిపించారు. తనపై అసమ్మత్తి గళం వినిపించిన ఐదుగురు ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపారు. కలిసి కూర్చొని మాట్లాడుకుందామంటూ ఆహ్వానించారు.
సోమవారం రోజున మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా మేడ్చల్ జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు భేటీ అయిన సంగతి తెలిసిందే. మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి ఒంటెత్తు పోకడలపైఎమ్మెల్యేలు చర్చించడం కలకలం రేపింది. నామినేటెడ్ పోస్టులన్నీ తన అనుచరులకే ఇచ్చుకుంటున్నారని.. ఇది పద్ధతి కాదని, కనీసం ప్రోటోకాల్ కూడా పాటించడం లేదని మల్లారెడ్డి తీరును తప్పుబట్టారు . ఇక నుంచి తగ్గేదేలేదని ఐదుగురు ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. మంత్రితో తాడోపేడో తేల్చుకుంటామనే తరహలో ప్రకటనలిచ్చారు. ఐదుగురు ఎమ్మెల్యేల భేటీ సెగ ప్రగతి భవన్ కు కూడా తాకినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలోనే మంత్రి మల్లారెడ్డికి ప్రగతి భవన్ నుంచి క్లాస్ పీకారనే ప్రచారం జరుగుతోంది.
ప్రగతి భవన్ నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతోనే మంత్రి మల్లారెడ్డి ప్రవచనాలు వల్లించినట్లు తెలుస్తోంది. తనపై తిరుగుబాటు ప్రకటించిన ఎమ్మెల్యేలను కలుస్తానని ప్రకటించడం ఇందులో భాగమని అంటున్నారు. ఎమ్మెల్యేలను కలిసి మాట్లాడుతా. వారి అసంతృప్తికి కారణం ఏంటో తెలుసుకుంటా. అవసరమైతే వారి ఇంటికి వెళ్లి సమస్యపై చర్చిస్తామన్నారు.
అయితే, పదవుల పంపకంలో కేసీఆర్ ,కేటీఆర్ ఆదేశాల మేరకే నడుచుకుంటానని తన సొంత నిర్ణయం ఉండదని వ్యాఖ్యానించడం ఐదుగురు ఎమ్మెల్యేలకు మరింత ఆగ్రహాన్ని తెప్పించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ , కేటీఆర్ ల పేర్లు చెప్పి తమను మరోసారి లొంగదీసుకోవాలని మంత్రి ప్రయత్నిస్తున్నారని వారు ఆగ్రహంగా ఉన్నారట.