ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత ప్రమేయం ఉన్నట్లు ఈడీ తేల్చింది. సమీర్ మహేంద్రు చార్జీ షీట్ లో ఈమేరకు కవిత పేరును చేర్చింది. సౌత్ గ్రూప్ నుంచి కవిత నేతృత్వం వహించారని…ఢిల్లీలో లిక్కర్ బిజినెస్ చేసిన ఇండో స్పిరిట్ కంపెనీకి అసలైన బాస్ కవితేనని చార్జీషీట్ లో ఈడీ పేర్కొంది.
దక్షిణాది నుంచి శరత్ రెడ్డి , మాగుంట రాఘవ రెడ్డిలతో కలిసి కవిత లిక్కర్ బిజినెస్ రన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆమె అరుణ్ పిళ్ళై ను బినామీగా పెట్టుకున్నారని చార్జీషీట్ లో ఈడీ పేర్కొంది. అయితే, ఈ చార్జీషీట్ ను సవివరంగా అధ్యయనం చేస్తే మొత్తం కవితే ఈ పాలసీ రూపకర్త అన్నట్లుగా అనిపిస్తుంది. మొత్తానికి, లిక్కర్ స్కామ్ లో కవిత ఎటు తప్పించుకోలేని స్థితిలోకి వెళ్లిపోయినట్లు అర్థం అవుతోంది.
ఈడీ అధికారులు 181పేజీల చార్జీ షీట్ ను దాఖలు చేశారు. ఇందులో దాదపు ముప్పై సార్లు కవిత పేరును ప్రస్తావించారు. సౌత్ గ్రూప్ నుంచి కవిత కీలకంగా వ్యవహరించారని అప్రూవర్ గా మారిన దినేష్ అరోరా పేర్కొన్నారు. లిక్కర్ బిజినెస్ కోసం హైదరాబాద్ , ఢిల్లీలోని హోటల్ లో పలుమార్లు వీరు సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఈడీ సేకరించింది. లిక్కర్ పాలసీకి సంబంధించి సమీర్ మహేంద్రు కవితను ఆమె ఇంట్లో కలిసి చర్చలు కూడా జరిపినట్లు ఈడీ చెబుతోంది.
మద్యం కుంభకోణంలో సౌత్ నుంచి ఆప్ కి చెందిన కొంతమంది నేతలకు హవాలా మార్గంలో ముడుపులు ముట్టినట్లు ఈడీ చెబుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో కవిత పాత్ర కీలకమని భావిస్తోన్న ఈడీ త్వరలోనే ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆధారాలు పక్కాగా ఉండటంతో కవిత మెడకు ఉచ్చు బిగుసుకుపోతుంది. ఆధారాలు పక్కాగా ఉండటంతో కవిత అరెస్ట్ ను ఎవరూ అడ్డుకోలేరని , ఎవైనా రాజకీయ ఒత్తిళ్ళు ఉంటె తప్ప అరెస్ట్ అసాధ్యమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ అడుగులు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
బీజేపీ, బీఆర్ఎస్ లు వీరోచితంగా కొట్లాడుతున్నట్లు నటిస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ కేసులో పక్కాగా ఆధారాలు సేకరించాక కూడా కవిత అరెస్ట్ పై సమాలోచనలు జరుగుతున్నాయంటే బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య ఎదో జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో బీఆర్ఎస్, లిక్కర్ స్కామ్ తో బీజేపీలు కాంగ్రెస్ ను బలహీనం చేసేందుకు రోజుకో కొత్త నాటకాలు షురూ చేస్తాయని రేవంత్ ప్రకటించినట్లుగానే, తాజా పరిణామాలు ఉండటంతో ఇదంతా రాజకీయ చదరంగంలో భాగమేననే అనుమానాలు బలపడుతున్నాయి.
1 Comment
Pingback: మల్లారెడ్డిని వదిలించుకునేందుకు కేసీఆర్ ప్లాన్..? - Polytricks.in