రెండడుగులు వెనక్కి వేశానంటే..మరింత వేగంతో దూసుకొచ్చెందుకే అన్నట్లుంది కరోనా మహమ్మారి తీరు. ప్రస్తుతం చైనాలో కనిపిస్తోన్న పరిస్థితులు ప్రపంచ దేశాలను భయపెట్టిస్తున్నాయి. అతి త్వరలోనే కరోనా మరో వేవ్ ప్రపంచాన్ని చుట్టేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే మూడు నెలలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పదిశాతం మందికి కరోనా మళ్ళీ సోకే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. చైనాలో పెరుగుతోన్న కేసులను చూస్తుంటే మరో వేవ్ తథ్యమని చెబుతున్నారు.
చైనాలో అంక్షలను ఎత్తివేసిన తరువాత అక్కడ పరిస్థితి పూర్తిగా దిగజారింది. ఆసుపత్రులన్నీ కోవిడ్ బాధితులతో నిండిపోయాయి. దాంతో అక్కడి జిన్ పింగ్ సర్కార్ అత్యవసరం కాని ఆపరేషన్లను వాయిదా వేస్తోంది. యుద్దప్రాతిపదికన కొత్త ఆసుపత్రులని నిర్మాణం చేపట్టాలని ఆదేశించింది. పరిస్థితి ఇలాగె కొనసాగితే రాబోయే మూడు నెలలో 60శాతం మంది వైరస్ బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో వరల్డ్ వైడ్ గా ఆందోళన నెలకొంది.
Also Read : కోరలు చాచిన కరోనా – ఒక్కరోజే పది లక్షల కేసులు
చైనాలో ఆంక్షలను ఎత్తివేసిన తరువాత కేసులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. అయితే, కేసుల సంఖ్యను చైనా దాస్తుందని.. అలాగే మరణాల సంఖ్య కుదించి చెబుతుందని ఫిగల్ డింగ్ ఆరోపించారు. ఓ హాస్పటిల్ లో పదుల సంఖ్యలో కరోనా బాధితులు ఉన్న ఫోటోను షేర్ చేసి అక్కడి పరిస్థితులను ప్రపంచానికి చూపించారు. వాస్తవానికి చైనాలో అంక్షల ఎత్తివేతను అక్కడి ప్రజలే కోరుకున్నారు. రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపడంతో కరోనా కేసులు పెరుగుతున్నా జిన్ పింగ్ సర్కార్ ఆంక్షలను ఎత్తివేసింది. ఫలితంగా కేసులు పెరుగుతున్నాయి. మూడు నెలల్లో కేసులు పీక్స్ స్టేజ్ కు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు వైద్యారోగ్య నిపుణులు.
చైనాలో కరోనా కేసుల పెరుగుదలపై అగ్రరాజ్యం స్పందించింది. చైనాలో కరోనా వ్యాప్తి ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తోందని పేర్కొంది. ఏ సమయంలోనైనా కరోనా మరింత చెలరేగిపోయే అవకాశం ఉందని, కరోనా పట్ల ప్రపంచ దేశాలు అలర్ట్ గా ఉండాలని హెచ్చరించింది. చైనాలో కరోనా మ్యుటేషన్లు ప్రపంచమంతా వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు చైనాలో కేసుల పెరుగుదల నేపథ్యంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసింది.
Also Read : మళ్ళీ కరోనా ఆంక్షలు – మాస్కులు ధరించాల్సిందే
ఇన్ సాకాగ్ నెట్ వర్క్ ద్వారా కరోనా వైరస్ రకాల జాడ పసిగట్టేందుకు పాజిటివ్ కేసులకు సంబంధించి జీనోమ్ సీక్వెన్సింగ్ ను పెంచాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవాలని సూచించింది.