బీఆర్ఎస్ లో లుకలుకలు మెల్ల, మెల్లగా బయటకొస్తున్నాయి. మంత్రి మల్లారెడ్డిపై అసంతృప్తి వెళ్లగక్కుతూ నలుగురు ఎమ్మెల్యేలు సమావేశం కావడం రచ్చకు కారణమైంది. అయితే, మేడ్చల్ జిల్లాలో మాత్రమే కాదు, పలు జిల్లాలో మంత్రులకు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ పెరిగిపోయినట్లు తెలుస్తోంది.
జిల్లాలో తమ మాటే చెల్లుబాటు కావాలని ఎమ్మెల్యేలపై మంత్రులు పెత్తనం చెలాయిస్తున్నారు. నామినేటెడ్ పదవుల పంపకంలో అనుచరవర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది ఎమ్మెల్యేలకు ఆగ్రహాన్ని తెప్పించింది. మంత్రుల వ్యవహారశైలిని అధిష్టానంతో చెప్పుకుందామంటే అపాయింట్ మెంట్ ఇవ్వరు. అపాయింట్ మెంట్ ఇస్తే ఎలా రియాక్ట్ అవుతారోనని ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు తాజాగా మల్లారెడ్డిపై తిరుగుబాటు చేశారు. ఈ నలుగురు ఎమ్మెల్యేల స్ఫూర్తితో మంత్రుల పెత్తనాన్ని ప్రశ్నించేందుకు ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు కూడా రెడీ అవుతున్నారు.
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విషయం పరిశీలిద్దాం. ఖమ్మం జిల్లాలో గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ పదవిని అధిష్ఠానం ఒక ఎమ్మెల్యే సన్నిహితుడికి ఇచ్చింది. దాంతో ఇతర నేతలు ఆయన ప్రమాణ స్వీకారానికి హాజరు కాకుండా నిరసన తెలిపారు. మరో మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా ఇలాంటి పనే చేశారని అంటున్నారు.
మహబూబాబాద్ జిల్లాలో పరిస్థితి అంత ఆశాజనకంగా ఏమి లేదు. మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ల మధ్య అభిప్రాయబేధాలు ఉన్నట్లు చెబుతున్నారు. మంత్రిపై ఎంపీ కవిత కూడా అసహనంగా ఉన్నారని అంటున్నారు. జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులను కలుపుకోవడం మానేసి…జరుగుతున్న పరిణామాలను కళ్ళప్పగించి చూస్తున్నారని ఎమ్మెల్యేలు లోలోపల మంత్రిపై ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఇక, ఎమ్మెల్యేలను కలుపుకుపోకుండా పెత్తనం చెలాయించే మంత్రులలో జగదీశ్ రెడ్డి, మహమూద్ అలీ, తలసాని, గంగులతోపాటు సబితా ఇంద్రారెడ్డి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, గ్రేటర్ కు సంబంధించిన మంత్రులే ఎక్కువగా ఎమ్మెల్యేలతో గ్యాప్ మెయింటేన్ చేస్తున్నారు.
ప్రభుత్వంలో , పార్టీలో అధిపత్య పోరును గుర్తించిన కేటీఆర్ , నేతల మధ్య సయోధ్య కుదిర్చినా ఫలితం వచ్చినట్లు లేదు. కేటీఆర్ సూచన మేరకు నడుచుకుంటామని ప్రకటనలు చేస్తున్నా నేతలు ఆ తరువాత మాకివన్నీ షరా మామూలేనన్నట్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ మంచిది కాదని, ఇదిలా కొనసాగితే పార్టీ చీలికకు బీజం వేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.