-మంత్రి ఎర్రబెల్లితో ఉత్తమ్ కుమార్ రెడ్డి సీక్రెట్ భేటీ
-పీసీసీ సమావేశానికి డుమ్మా కొట్టి ఎర్రబెల్లితో మంతనాలు
-మూడు గంటలపాటు సుదీర్ఘ చర్చలు
-భేటీ విషయం తెలిసి వెళ్లిన ఛానెల్ ప్రతినిధికి బెదిరింపులు
-మీటింగ్ అరెంట్ చేసిన మైహోం రామేశ్వర్ రావు
టీపీసీసీ మాజీ సారధి ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్ కోవర్టన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన టీఆర్ఎస్ అధినేత కనుసన్నలో పని చేసి కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచారని రాజకీయ వర్గాల్లో ఓ చర్చ ఉండనే ఉంది. పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఆయన పీసీసీ చీఫ్ గా ఉన్నపుడే టీఆర్ఎస్ లోకి వెళ్ళారు. దీని వెనక ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తం ఉందన్న ఆరోపణలూ ఉన్నాయి. ప్రస్తుతం పార్టీలో సంక్షోభ వాతావరణం గట్టిపడేలా నేతృత్వం వహిస్తోన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో సీక్రెట్ గా భేటీ కావడం సంచలనంగా మారింది.
మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండలం తాబేదార్ పల్లిలో వీరిద్దరూ రహస్యంగా భేటీ అయ్యారు. ఓ వైపు పీసీసీ కార్యవర్గ సమావేశం జరుగుతుండగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కీలక సమావేశానికి డుమ్మా కొట్టేసి, రాజకీయ ప్రత్యర్ధి పార్టీకి చెందిన మంత్రి ఎర్రబెల్లితో భేటీ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో ఏర్పడిన సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీతోపాటు బీఆర్ఎస్ లు ప్రయత్నిస్తున్నాయి ఇందుకోసం ఉత్తమ్ కుమార్ రెడ్డిని మధ్యవర్తిగా ఉంచి, సీనియర్లను గంపగుత్తగా పార్టీలోకి లాగేసుకోవాలని బీఆర్ఎస్ అధిష్టానం చూస్తున్నట్లు తెలుస్తోంది.
మంత్రితో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకంగా మూడు గంటలపాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో ఏం చర్చించారన్నది సీక్రెట్ గా ఉంచారు. కాని పార్టీలో అసంతృప్తి స్వరాలకు నాయకత్వం వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ శత్రు పార్టీ నేతతో సమావేశం కావడం చూస్తె ఎదో బ్లాస్ట్ అయ్యే వార్త ఉండే ఉంటుంది. ఇక, ముందస్తు ఆలోచన లేదని కేసీఆర్ చెప్తున్నా.. రాష్ట్రంలో రానురాను పార్టీ బలహీనపడుతుందన్న నివేదికలతో మరోసారి ముందస్తుకు వెళ్లాలని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీని బలోపేతం చేసే చర్యలపై దృష్టి సారించారు. పైగా పార్టీని జాతీయ స్థాయి పార్టీగా తీర్చిదిద్దుతోన్న నేపథ్యంలో పార్టీకి కీలక నేతల అవసరం ఏర్పడింది. దీంతో ఆయన కాంగ్రెస్ లోని సీనియర్ నేతలను బీఆర్ఎస్ లోకి తీసుకొచ్చేందుకు ప్రస్తుత పరిణామాలను వాడుకోవాలకుంటున్నారు. ఈ బాధ్యతను కోవర్ట్ ఆపరేషన్ లో కింగ్ మేకర్ అయిన ఎర్రబెల్లికి అప్పగించినట్లు తెలుస్తోంది.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు రహస్యంగా భేటీ అయిన విషయం తెలుసుకున్న ఓ ఛానెల్ రిపోర్టర్ వార్త కోసం అక్కడికి వెళ్ళినట్లు సమాచారం. అయితే, సదరు ఛానెల్ రిపోర్టర్ కు మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు తామిద్దరం భేటీ అయినట్లు బయటకు లీక్ చేయకు అంటూ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. అభివృద్ధి నిధుల కోసమో, ఇంకేదో పని మీదో సమావేశమైతే రహస్యంగా భేటీ అయ్యే అవకాశం లేదు. అలాగే, రాజకీయ అంశాలను చర్చించి ఉండకపోతే ఛానెల్ రిపోర్టర్ ను బెదిరించేవారే కాదు. కాని వీరి భేటీ విషయాన్ని బయటకు లీక్ చేయవద్దని వార్నింగ్ ఇచ్చారంటే లోలోపల పెద్ద తతంగమే నడుస్తున్నట్లు అర్థం అవుతోంది. వీరిద్దరి భేటీని కేసీఆర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డిల మధ్యవర్తి అయిన మైహోం రామేశ్వర్ రావు కుదిర్చినట్లు తెలుస్తోంది.