టి. కాంగ్రెస్ ఏర్పడిన సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై అసంతృప్తి స్వరాన్ని వినిపించిన సీనియర్లను గ్రూప్ గా బీజేపీలో చేర్చుకొని.. తెలంగాణ కాంగ్రెస్ బీజేపీలో విలీనమైందని చెప్పుకోవాలని తెగ ఆరాటపడుతోంది. దీనికోసం కమలనాథులు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
అధికార పార్టీ నేతలకు టచ్ లోకి వెళ్తే ఇంటలిజెన్స్ వర్గాలు ఈజీగా పసిగట్టేస్తున్నాయి. అదే కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరిపితే అలాంటి ప్రమాదం ఉండదు. అందుకే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలతో రాష్ట్ర బీజేపీ నేతలే పార్టీ మార్పుపై చర్చిస్తున్నట్టు లీకులు ఇస్తున్నారు. బీజేపీలో చేరేందుకు టి. కాంగ్రెస్ సీనియర్లు అంగీకరిస్తే బీజేపీ అగ్రనాయకత్వం సమక్షంలో పార్టీలో చేరికను ఖరారు చేస్తామని.. ఇందుకోసం ప్రత్యేకంగా విమానాన్ని ఏర్పాటు చేస్తామని ప్రచారం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. తొమ్మిది మంది సీనియర్ నేతల్ని ఒకేసారి బీజేపీలో చేర్చుకుంటే కాంగ్రెస్ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయవచ్చునని బీజేపీ నాయకత్వం భావిస్తోంది.
తొమ్మిది మంది సీనియర్ నేతలు బీజేపీకి టచ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో వారు కోవర్ట్ లన్న ముద్ర పడింది. తాజాగా నియామకమైన పార్టీ కమిటీలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తిరుగుబాటు చేయడం…ఆ తరువాత బీజేపీ వైపు లీకులు వస్తుండటంతో సీనియర్ నేతలు చిక్కులో పడ్డారు. సీనియర్ నేతలకు కాంగ్రెస్ ను వీడే ఆలోచన ఉందొ లేదో క్లారిటీ లేదు. కాని తొమ్మిది మందిలో ఒకరిద్దరు మాత్రం బీజేపీతో టచ్ లో ఉన్నారని బలంగా నమ్ముతున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమయం చూసుకొని మూట సర్దేసేలా ఉండగా…దామోదర రాజ నరసింహ అయితే ఫాం హౌజ్ నిందితులతో భేటీ అయినట్లు ప్రచారం జరగడంతో వీరు త్వరలోనే బీజేపీలో చేరడం ఖాయమని అంటున్నారు.
వీరితోపాటు అసంతృప్తుల జాబితాలో మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేరిపోయారు. ఆయనపై చాలాకాలంగా టీఆర్ఎస్ కోవర్టన్నముద్ర ఉంది. తన రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి తీసుకొచ్చిన పాడి కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ లోకి పంపించారు. ఇదిలా ఉండగానే సీనియర్ నేతలు బీజేపీతో టచ్ లో ఉన్నారన్న వార్తలతో అధిష్టానం మెప్పును సైతం కోల్పోతున్నారు. సీనియర్ల వైఖరి చూస్తుంటే రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు పరోక్షంగా సహాయపడుతున్నట్లు అర్థం అవుతోంది.