తెలంగాణ ఉద్యమ నినాదం..నీళ్లు, నిధులు, నియామకాలు ప్రాతిపదికన కొనసాగిందని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణ వస్తే లక్షలాది ఉద్యోగాలు వస్తాయని ఆశ చూపించారని కేసీఆర్ నుద్దేశించి ప్రస్తావిస్తూ లేఖ రాశారు. అధికారంలోకి వచ్చాక ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చకుండా అన్నీ మర్చిపోయి వారి నోట్లో మట్టి కొట్టారన్నారు.
కేసీఆర్ కు రేవంత్ రెడ్డి రాసిన లేఖ యధావిధిగా
టీఆర్ఎస్ ఎనిమిదేళ్ల పాలనలో తీవ్ర నిరాశ మిగిల్చారని విమర్శించారు. పోలీస్ విభాగంలో ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం గత ఆగస్టులో ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించారు. కొలువులు వస్తాయని ఆశించిన యువతకు ఈ పరీక్ష తీవ్ర ఆవేదనను మిగిల్చింది. ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ విధానాన్ని చూస్తే చాలు కొలువుల భర్తీలో మీ ప్రభుత్వ చిత్తశుద్ధి ఎంతో తెలుస్తోంది.ప్రిలిమినరీ రాత పరీక్షలో పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ రెండూ ప్రశ్నపత్రాల్లో చెరో 7 మల్టిపుల ఛాయిస్ ప్రశ్నలకు సంబంధించి అభ్యర్ధుల్లో గందరగోళం నెలకొంది. ఈ 7 ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సంబంధించి కొందరికి మార్కులిచ్చారు. అసలు సమాధానం ఇవ్వని వారికి సైతం మార్కులు కేటాయించారు. కానీ కొందరు అభ్యర్ధులకు మాత్రం మార్కులు ఇవ్వలేదు. ఈ విషయాన్ని అభ్యర్ధులు తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) దృష్టికి తీసుకు వెళ్లారు. అయిన ఎటువంటి స్పందన లేకుండానే మెరిట్ జాబితాను రూపొందించి ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు గత శుక్రవారం (డిసెంబర్ 9)న తీర్పునిచ్చింది. అభ్యర్ధులు పేర్కొన్న 7 ప్రశ్నలను తొలగించాలని ఆదేశించింది. ఆ మేరకు అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఈవెంట్లలో పాల్గొనే అవకాశమివ్వాలని కోరింది. అయినప్పటికీ ఎటువంటి స్పందన లేదు. టీఎస్ఎల్పీఆర్బీ హెల్ప్ డెస్క్ కు ఫోన్ చేస్తే తీర్పు కాపీ మాకు అందలేదు అనే సమాధానం వస్తుంది. దీంతో వేలాది మంది అభ్యర్ధులు మనోవేదనకు గురవుతున్నారు. హైకోర్టు తీర్పును అమలు చేస్తే దాదాపు 50-60 వేల మంది అభ్యర్ధులకు ఫిజికల్ టెస్టులకు హాజరయ్యే అవకాశం లభిస్తుంది.
అభ్యర్ధులు తమ ఆవేదనను ట్విట్టర్ లో కేటీఆర్, డీజీపీలకు విన్నవించుకున్న సమాధానం రాలేదు. సంబంధిత శాఖను చూసే హోం మంత్రి ఉన్నాడా లేడో తెలియదు. మీరేమో ఇవేమీ పట్టన్నట్లు బీఆర్ఎస్ అంటూ దేశమంతా తిరుగుతుంటారు. పాలన ఈ విధంగా ఉంటే ఉద్యోగార్థుల సమస్యను తీర్చెదెవరు? హై కోర్టు ఆదేశించిన ప్రిలిమినరీ పరీక్షలోని 7 ప్రశ్నలను తొలగించి అభ్యర్ధులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక కోసం నిర్వహించే ఫిజికల్ ఈవెంట్లలో మూడింటికి మూడు ఈవెంట్లలో అర్హత సాధించిన వారికి ఏఆర్, టీఎస్ఎస్పీ కేటగిరీ పోస్టుల భర్తీలో అవకాశం కల్పించాలి. అదేవిధంగా ఫిజికల్ ఈవెంట్లలో మూడింటిలో రన్నింగ్ లో అర్హత సాధించి మిగతా రెండిటిలో ఏదో ఒక దాంట్లో క్వాలిఫై అయిన వారిని సివిల్ పోస్టుల కోసం పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాను.
ఎ. రేవంత్ రెడ్డి,
ఎంపీ – మల్కాజ్ గిరి,
టీపీసీసీ – అధ్యక్షుడు