ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసును కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ పలు ప్రాంతీయ పార్టీల అధినేతలకు, రైతు సంఘాల నేతలకు కేసీఆర్ ఆహ్వానం పంపారు కాని, అఖిలేష్ యాదవ్ మినహా చెప్పుకోదగ్గ నేతలెవరూ ఈ ఈవెంట్ కు హాజరు కాలేదు. ఆదిలో బీఆర్ఎస్ కు చుక్కెదురైనట్లు అనిపించింది. నెక్స్ట్ డే పార్టీ కార్యాలయంలోనే కేసీఆర్ ఉండటంతో కీలక నేతలు మద్దతు తెలిపేందుకు, శుభాకాంక్షలు తెలిపేందుకు వస్తారని పార్టీ వర్గాలు అంచనా వేశాయి. బీఆర్ఎస్ నేతలు తప్ప బయట నేతలెవరూ పార్టీ కార్యాలయం గడప తొక్కలేదు.
బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ఘనంగా ప్రారంభించాలని, జన సమూహాన్ని ఎక్కువగా కనిపించేలా ఉంచాలని కేసీఆర్ ఆదేశాలతో ఒక్కో ఎమ్మెల్యే సొంత డబ్బులతో వంద మందిని వెంటేసుకెళ్ళారు. గురువారం వారంతా కేసీఆర్ ను కలిసి శుభాకాంక్షలు చెప్పారు. వారు తప్ప తెలంగాణేతరులు ఎవరూ కనిపించలేదు. బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభించినందుకు కేసీఆర్ కు శుభాకాంక్షలు చెప్పేందుకైనా ప్రముఖ నేతల్ని రప్పించలేకపోయారు. బీఆర్ఎస్ కు జాతీయ స్థాయిలో మద్దతు లభిస్తుందని చెప్పుకునేందుకుకైనా కొంతమంది మద్దతుదారులను పిలిపించుకోవాల్సి ఉండే. కాని అలాంటిదేం చేయలేకపోయారు.
కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన నేతల్ని ఆకర్షించడంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారు. పార్టీకి మద్దతు తెలపకపోయినా, కనీసం విషెస్ కూడా ప్రముఖ నేతలెవరూ చెప్పలేదు. సామజిక మాధ్యమాల ద్వారా కూడా ఆ పని చేయలేదు. బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మర్యాదపూర్వకంగా విషెస్ చెప్పినా కేసీఆర్ దాన్ని ఎలా అనుకూలంగా మలుచుకుంటారో అందరికి తెలుసు. అందుకే సోషల్ మీడియాలోనూ కేసీఆర్ కు తెలంగాణేతర నేతలు విషెస్ చెప్పేందుకు ఇష్టపడలేదు. మొత్తానికి , జాతీయ పార్టీ ఫ్లేవర్ ను కేసీఆర్ మిస్ అయినట్టు అనిపించింది.