కాంగ్రెస్ పార్టీ బ్యాక్ ఆఫీసుపై పోలీసుల దాడిని నిరసిస్తూ టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు యత్నించిన ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం తెల్లవారుజామునే ఆయన ఇంటి వద్ద పోలీసులు మోహరించారు.
బయటకు వెళ్లేందుకు ఉదయం రోహిన్ రెడ్డి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రోహిన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అనుమతి లేకుండా కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ లోకి పోలీసులు వెళ్లి సోదాలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఓ అనామక వ్యక్తి ఫిర్యాదు చేస్తే కనీసం నోటీసులు ఇవ్వకుండా మాదాపూర్ లోని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆఫీసులోనీ హార్డ్ డిస్క్ లు, సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకోవడం అప్రజాస్వామికమన్నారు. ఇది ప్రజాస్వామ్యమా..? రాచరికమా అని నిలదీశారు.
ప్రజాస్వామ్య హక్కులను తెలంగాణ ప్రభుత్వం హరిస్తోందని రోహిన్ రెడ్డి మండిపడ్డారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ తప్పొప్పులను ఎత్తి చూపడం నేరమా అని ప్రశ్నించారు. కవితపై బీజేపీ ఎంపీ అరవింద్ అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ, టీఆరెఎస్ కార్యకర్తలు పోటాపోటీగా రౌడీలా మాదిరి ఘర్షణ వాతావరణం సృష్టిస్తే ఎలాంటి చర్యలు తీసుకొని పోలీసులు… టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని సోషల్ మీడియాలో గుర్తుచేస్తే కేసు నమోదు చేయడం సరైంది కాదన్నారు. తెలంగాణను వెస్ట్ బెంగాల్ మాదిరి మార్చి రాజకీయ పబ్బం గడుపుకోవాలని రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుంటారు కాని, సోషల్ మీడియాలో ప్రభుత్వ హామీల అమలుపై నిలదీస్తే నోటీసులు కూడా ఇవ్వకుండా ఆఫీసును సీజ్ చేస్తారా..?ఇదెక్కడి దుర్మార్గం అంటూ రోహిన్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ పోలీసు వ్యవస్థను కేసీఆర్ భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఉడత ఊపులకు ఎవరు భయపడరనీ మరింత రెట్టించిన ఉత్సాహంతో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని హెచ్చరించారు.