రంగారెడ్డి జిల్లా మన్నెగూడకు చెందిన యువతిని సినీ ఫక్కీలో కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. సిరి టౌన్ షిప్ లోకి 100మంది యువకులు వచ్చేసి యువతి ఇంటి ఎదుట నానా హంగామా చేసి ఆమెను ఎత్తుకెళ్ళారు. ఈ సంఘటన సినిమాటిక్ తరహాలో జరిగిపోయింది.
సిరి టౌన్ షిప్ కు చెందిన ముచ్చెర్ల దామోదర్ రెడ్డి, నిర్మల దంపతుల కూతురు వైశాలిని కిడ్నాప్ చేశారు. శుక్రవారం మిస్టర్ టీ ఓనర్ నవీన్ రెడ్డి 100మంది యువకులతో వారి ఇంటికెళ్ళి వైశాలిని ఎత్తుకెళ్ళినట్లు దామోదర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు యువతిని సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.
అయితే, వైశాలిని మిస్టర్ టీ యజమాని నవీన్ రెడ్డి కిడ్నాప్ చేసేందుకు కారణం ఎంటని ఆరా తీస్తే ప్రేమ వ్యవహారమేనని తెలిసింది. నవీన్ రెడ్డి, వైశాలి కొంతకాలం కిందట ప్రేమించుకున్నారు. అయితే, వారి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో విడిపోయారు. కొంతకాలంగా నవీన్ కు వైశాలి దూరంగా ఉంటోంది. పెళ్లి చేసుకుందామని నవీన్ వేదిస్తుండటంతో ఇక లాభం లేదనుకొని వైశాలి మరో వ్యక్తితో పెళ్లికి రెడీ ఐపోయింది. శుక్రవారం పెళ్లి వాళ్ళు వైశాలి ఇంటికి వస్తున్నారని తెలుసుకున్న నవీన్ రెడ్డి 100మంది యువకులతో ఆమె ఇంటికెళ్ళి వైశాలిని ఎత్తుకెళ్ళిపోయారు.
పెళ్లి సంబంధాన్ని చెడగొట్టేందుకు వచ్చి ఇంటి దగ్గర రచ్చ, రచ్చ చేశారని వైశాలి కుటుంబ సభ్యులు నవీన్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవీన్ రెడ్డి తీరుతో మిస్టర్ టీ స్టాల్ పై దాడి చేశారు. తీవ్ర ఆగ్రహానికి లోనై టీ స్టాల్ కు నిప్పు కూడా పెట్టారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.