సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునే స్థోమత లేని వారికీ టి. సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇల్లును నిర్మించుకునేందుకు 3లక్షలు ఇచ్చేందుకు గైడ్ లైన్స్ ను అధికారులు పొందుపరచారు. శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ అద్యక్షతన జరగనున్న క్యాబినెట్ భేటీలో ఈ పథకంపై చర్చించనున్నారు. అదే రోజు ఈ పథకంపై ప్రకటన ఉండనున్నట్లు సమాచారం.
సొంత జాగా ఉన్న వారికీ ఇల్లు కట్టుకునేందుకు 3లక్షల ఆర్ధిక సాయాన్ని అందించే పథకాన్ని 15రోజుల్లో ప్రారంభిస్తామని కేసీఆర్ మహబూబ్ నగర్ పర్యటనలో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ ను అధికారులు ఖరారు చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలంటే భారీగా స్థల సేకరణ చేయాల్సి ఉంటుంది. ఒక్కో చోట ఇది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. దాంతో కేసీఆర్ సొంత జాగా ఉన్న వారికీ 3లక్షల సాయాన్ని అందించాలని నిర్ణయించారు. నియోజకవర్గానికి వేయి మందిని ఎంపిక చేయనున్నారు.
గైడ్ లైన్స్ ఇవే
- సొంత జాగా ఉండి తెల్ల రేషన్ కార్డు కల్గి ఉండాలి.
- ఒకే సారి కాకుండా దశల వారీగా రూ.3లక్షల సాయాన్ని అందజేస్తారు
- డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం జరగని గ్రామాలకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది
- ఇందిరమ్మ ఇళ్లు పొందినవారికి నో ఛాన్స్
- ఇంటి నిర్మాణానికి కనిష్ఠంగా 75 గజాల స్థలం ఉండాలి
- మహిళ పేరిటే ప్రభుత్వ సాయాన్ని అందిస్తారు.
- తహసీల్దార్, ఎంపీడీవోలు లబ్ధిదారులను గుర్తిస్తే కలెక్టర్ ఆమోదిస్తారు. అయితే.. ఎమ్మెల్యేలు, మంత్రుల పరిశీలన తర్వాతే ఎంపిక జరుగుతుంది