డిసెంబర్ 12న టీఆర్ఎస్ గులాబీ కూలీ, అవినీతిపై ఢిల్లీ హైకోర్టులో కేసు విచారణకి రానుందన్నారు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. కేసు విచారణకు వచ్చే ముందే ఎన్నికల కమిషన్ టీఆర్ఎస్ పేరుని బీఆర్ఎస్ గా మార్చేశారని…బీజేపీ సూచనలతోనే ఎన్నికల కమీషన్ టీఆర్ఎస్ కి సహకరించిందని సంచలన ఆరోపణలు చేశారు. కోర్టు ధిక్కరణకి పాల్పడ్డ కేంద్ర ఎన్నికల కమీషన్ పై లీగల్ ఫైట్ చేస్తామని రేవంత్ తెలిపారు.
ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రమాద భీమా చెక్కుల పంపిణీ, పేదలకు బట్టల పంపిణీ, రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సనర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడారు. గుజరాత్ మినహా అన్ని చోట్ల బీజేపీ ఓటమి పాలైందని..ఢిల్లీ ప్రజలు మోడీ నాయకత్వాన్ని తిరస్కరించారు. హిమాచల్ ప్రదేశ్ లో మోడీ మేనియా పని చేయలేదని చెప్పారు. గుజరాత్ లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుందని.. మిగిలిన చోట్ల ఆ పార్టీని బొంద పెట్టారని చెప్పారు. బీజేపీ అధికారంలోనున్న యూపీలోనూ కాషాయ పార్టీ ఓడిపోయిందని, బీజేపీ వ్యతిరేక పవనాలు మొదలయ్యేందుకు ఇది నిదర్శనమని పెర్కొన్నారు రేవంత్. బీజేపీ అనుకూల మీడియా ఈ వార్తను చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తోందన్నారు.
Also Read : ఒడిసిన టీఆర్ఎస్ కథ..!
తెలంగాణ పేరుని కేసీఆర్ కృష్ణార్పనం చేశారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. సజ్జల రామకృష్ణ ఏపీ సీఎం జగన్‌కి ఆత్మ లాంటివాడని… సజ్జల చేసిన వ్యాఖ్యలను కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఖండించలేదని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర మనుగడను గుర్తించడానికి కూడా కేసీఆర్ అంగీకరించడంలేదన్నారు. సజ్జల వ్యాఖ్యలకు కేసీఆర్ సంపూర్ణ మద్దతు ఉందన్న రేవంత్… ఇది పక్కా ప్రణాళికతో జరిగిందన్నారు. మేధావులు, అమరుల కుటుంబాలు, తెలంగాణ సమాజం కేసీఆర్ వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీల్చడానికే కేసీఆర్ ను బీజేపీ వాడుకుంటోందని…ఎంఐఎం, ఆప్ పార్టీల్లా జాతీయ స్థాయిలో మూడో పార్టీగా కేసీఆర్ ను బీజేపీ ఉపయోగించుకోవాలనుకుంటోందని రేవంత్ ఆరోపించారు. దక్షిణ భారత దేశంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు గండి కొట్టాలని బీజేపీ ప్లాన్ వేస్తోందని అందులో భాగమే బీఆర్ఎస్ కు ఆగమేఘాల మీద అనుమతి రావడమన్నారు. టీఆరెస్ బీఆరెస్ గా మారడం వెనక కుట్ర దాగుందన్నారు. తెలంగాణను, ఆంధ్రాను కలపడానికి మళ్లీ కుట్ర చేస్తున్నారు. దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. టీఆరెస్ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.