డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని అటో డ్రైవర్ రమేష్ ఆత్మహత్యతో తేలిపోయిందని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ గాలి అనిల్ కుమార్ అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు మంజూరు కావాలంటే అధికార పార్టీ నేతలు అడిగినంత ఇచ్చుకోలేక లబ్దిదారులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారన్నారు. సిద్ధిపేట కౌన్సిలర్ ప్రవీణ్ కు లక్ష రూపాయలు మూటజెప్పినా, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాకపోగా వేధింపులు ఎక్కువవ్వడంతోనే రమేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు.
సీఎం కేసీఆర్ సొంత జిల్లా, మంత్రి హరీష్ ప్రాతినిధ్యం వహిస్తోన్న సిద్ధిపేటలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే, రాష్ట్రవ్యాప్తంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పంపిణీలో ఎలాంటి అవకతకలు జరుగుతున్నాయో చెప్పనవసరం లేదన్నారు. రమేష్ మృతిపై ఇంతవరకు కేసీఆర్ ,హరీష్ రావులు స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. బాధిత కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాకుండా కౌన్సిలర్ అడ్డుకున్నారంటే ఆయన ఎవరి ఆదేశాలతో కలెక్టర్ పై ఒత్తి డి తీసుకొచ్చాడని ప్రశ్నించారు. రమేష్ కుటుంబానికి నాలుగు సార్లు మంజూరు అయిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లును, బడా నేతల ఆదేశాలు లేకుండానే పెండింగ్ లో పెట్టారా అని నిలదీశారు.
డబుల్ బెడ్ రూమ్ దందాలో కౌన్సిలర్ మధ్యవర్తి మాత్రమేనని ఈ దందా వెనక అసలు దోషులెవరో తేల్చాలని గాలి అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. హరీష్ రావు ఇలాకాలో ఆయన ప్రమేయం లేకుండానే అధికార పార్టీ నాయకుడు లబ్దిదారులకు అందిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను అడ్డుకుంటాడా..? దీని వెనక హరీష్ రావు ప్రమేయం ఉన్నట్లు తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఈ కేసులో నిష్పాక్షపాతంగా విచారణ జరిగితే సంచలన నిజాలు బయటకొచ్చే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం ఉచితంగానే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను ఇస్తునట్లు ప్రకటిస్తోన్నా రాష్ట్రవ్యాప్తంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ దందాను టీఆర్ఎస్ నేతలే చేపట్టారని విమర్శించారు.
మృతుడు రమేష్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలన్న గాలి అనిల్.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను కేటాయించి, అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగమివ్వాలని డిమాండ్ చేశారు.