ధరణి, రైతు రుణమాఫీ, పోడు భూముల వంటి సమస్యలతోపాటు పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో తెలంగాణ సర్కార్ విఫలమైందని టీపీసీసీ పిలుపు మేరకు మెదక్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు కదం తొక్కాయి. టీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం, అసమర్ధతను వ్యతిరేకిస్తూ సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ గాలి అనిల్ కుమార్ నేతృత్వంలో రైతులతో కలిసి పార్టీ శ్రేణులు నిరసన తెలిపాయి. ఈ సందర్భంగా గాలి అనిల్ మాట్లాడుతూ టీఆర్ఎస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు.
ధరణి ద్వారా భూకబ్జాలు పెరిగిపోయాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లో జరిగిన అవకతవకల వల్ల రైతులు భూమిపై హక్కులను కోల్పోయారని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. పోడు భూములకు పట్టాలిస్తానని హామీ ఇచ్చి నాలుగేళ్ళుగా కాలయాపన చేస్తున్నాడని కేసీఆర్ వైఖరిని తూర్పారపట్టారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తోన్న ప్రభుత్వానికి పాలించే హక్కు లేదన్నారు. రైతు క్షేమమే ప్రధాన లక్ష్యమన్న గాలి అనిల్ రైతు రాజ్యం కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడంతోపాటు పంటకు గిట్టుబాట ధర అందిస్తామని గాలి అనిల్ కుమార్ తెలిపారు. లోపభూయిష్టమైన ధరణిని రద్దు చేసి పాత విధానం అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. కాంగ్రెస్ హయంలో పేదలకు పంచిన అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్న ఆయన… పేదల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అసైన్డ్ భూములను కొనుగోలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చినట్లు చెప్పారు. టీఆర్ఎస్ ఎనిమిదేళ్ళ పాలనలో ఏమున్నది గర్వకారణం అన్ని అవినీతి అక్రమలేనని మండిపడ్డారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.
భూసమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి , సంజీవరెడ్డి , మండల అధ్యక్షులు , సర్పంచ్ లు , ఎంపీటీసీలు , కౌంల్సీలర్లు , తదితరులు పాల్గొన్నారు.