తెలంగాణ సీఎం కేసీఆర్ గారాలపట్టి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటిసులు ఇవ్వడం బాగానే ఉంది. నోటీసులకు సమాధానం చెబుతానని ఆమె అంగీకరించడం కూడా ఒకే. కాని తెలంగాణలో సీబీఐ దర్యాప్తుపై ప్రభుత్వం నిషేధం విధిస్తూ జనరల్ కన్సెంట్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి కవితను విచారించేందుకుగాను సీబీఐకి తెలంగాణ సర్కార్ పర్మిషన్ ఇస్తుందా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
సీబీఐ జనరల్ కన్సెంట్ ను తెలంగాణ సర్కార్ రద్దు చేయడంతో నేరుగా దర్యాప్తు చేసేందుకు సీబీఐకి వీలు ఉండదు. ఎవరినైనా విచారించాలంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే. సర్కార్ ఒకే చెప్తే విచారణ చేసుకోవచ్చు. లేదంటే లేనట్టే లెక్క. ఏవరైనా అవినీతికి పాల్పడినట్లు సీబీఐకి సమాచారం ఉంటె రాష్ట్ర స్థాయిలో ఏసీబీ అధికారులే దాడి చేస్తారు. అయితే, సీబీఐ జనరల్ కన్సెంట్ ను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. లిక్కర్ స్కామ్ లో కవితను విచారించేందుకు సీబీఐకి ప్రభుత్వం అనుమతి ఇస్తుందా అనుకుంటుండగానే, కల్వకుంట్ల కవితనే నేరుగా సీబీఐ రావడానికి అంగీకరించడంతో ఇక విచారణకు లైన్ క్లియర్ అయినట్లే.
కవితే బహిరంగంగా సీబీఐ రావడానికి అంగీకరించాక సర్కార్ నిరాకరిస్తే కేసీఆర్ మరో తలనొప్పిని కొనితేచ్చుకున్నట్లే. కాబట్టి సీబీఐ దర్యాప్తుకు ఆటంకాలు తొలగినట్లేగా అర్థం అవుతోంది. హైదరాబాద్ లేదా ఢిల్లీలో ఎక్కడైనా విచారణకు హాజరు కావొచ్చుననికవితకిచ్చిన సీబీఐ నోటిసులో పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ లో సీబీఐ విచారణకు హైదరాబాదే సేఫ్ ప్లేస్ గా కవిత భావిస్తున్నారు. ఢిల్లీలో విచారణ అంటే కష్టం. ఎందుకంటే అక్కడి పోలీసు వ్యవస్థ కేంద్రం కంట్రోల్ లో ఉంటుంది. వీటిని అంచనా వేసిన కవిత హైదరాబాద్ ను విచారణకు వేదికగా ఎంచుకున్నారు.