ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలకు రవాణా ఇబ్బందులను తప్పించేందుకు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ గాలి అనిల్ సరికొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు. శంషాబాద్ వరకు మెట్రో సేవలను విస్తరించాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులను ప్రారంభించేందుకుగాను డిసెంబర్ 9న శంకుస్థాపన చేయనుంది. ఈ నేపథ్యంలోనే మెట్రో సర్వీసులను మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు పొడగించేలా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గాలి అనిల్ డిమాండ్ చేశారు. ఆయన లేవనెత్తిన డిమాండ్ కు మెదక్ జిల్లా వాసులు పార్టీలకు అతీతంగా మద్దతు తెలుపుతున్నారు.
సంగారెడ్డి పట్టణం గ్రేటర్ హైదరాబాద్ కు సమీప దూరంలో ఉండటంతో నిత్యం లక్షలాది మంది మహానగరానికి రాకపోకలు కొనసాగిస్తుంటారు. BHEL, BDL, MRF, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, పలు బీరు కంపెనీలతోపాటు చిన్న, మధ్యతర పరిశ్రమలు, విద్యా సంస్థలు సంగారెడ్డి చుట్టు పక్కల ఏరియాలో ఉండటంతో ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు హైదరాబాద్ నుంచి ప్రతిరోజు రాకపోకలు కొనసాగిస్తుంటారు. దీంతో మియాపూర్ వరకు 65వ నెంబర్ జాతీయ రహదారి అత్యంత రద్దీగా ఉంటుందని…సరైన రవాణా వ్యవస్థ లేక ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయని కాబట్టి మెట్రో సర్వీసులను మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు పొడగించాలని గాలి అనిల్ తీసుకొచ్చిన ప్రతిపాదనకు అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు ఎదురు అవుతోంది.
నిజానికి, ఉమ్మడి మెదక్ జిల్లాలోనే అభివృద్ధి కేంద్రీకృతమైందని అందరూ అంటున్నారు కాని, అందులో ఎలాంటి వాస్తవం లేదని చెప్పుకొచ్చారు గాలి అనిల్. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ , ప్రభుత్వంలో నెంబర్ 2 కేటీఆర్, నెంబర్ 3హరీష్ రావులు ప్రాతినిధ్యం వహిస్తున్నా… ప్రజా రవాణాను మెరుగు పరచడంలో విఫలం అవుతున్నారని విమర్శించారు. తాను లేవనెత్తిన సంగారెడ్డి వరకు మెట్రో సర్వీసులను ప్రారంభించాలనే ప్రతిపాదనను త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో . మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రస్తావించి కేంద్రం నుంచి నిధులు రాబట్టేలా చొరవ చూపాలని సూచించారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఎలాంటి అభివృద్ధి చేయలేక ఇప్పుడు ఓటమి భయంతో దుబ్బాక అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని ప్రభాకర్ రెడ్డిపై మండిపడ్డారు.
ఓల్డ్ సిటీ, యాదగిరిగుట్టకి మెట్రో సేవలను విస్తరించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం, సంగారెడ్డికి మాత్రం మెట్రోను విస్తరించాలనే ఆలోచన చేయకపోవడం విడ్డూరమని గాలి అనిల్ అన్నారు. శంషాబాద్ వరకు మెట్రో సేవలను విస్తరించాలని నిర్ణయం తీసుకున్నట్టుగానే సంగారెడ్డి వరకు కూడా మెట్రోను విస్తరించాలని ఇందుకోసం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజా ప్రతినిధులంతా పార్టీలకు అతీతంగా ఏకం కావాలని సూచించారు. మెట్రో లైన్ సాధన కోసం జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమించాలని నిర్ణయం తీసుకునే యోచనలో గాలి అనిల్ కుమార్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఏదీ, ఏమైనా గాలి అనిల్ తెరపైకి తీసుకొచ్చిన ప్రతిపాదనకు ప్రజామోదం దండిగా వస్తోంది. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికుల నుంచి ఊహించనిరీతిలో స్పందన లభించింది. సంగారెడ్డి వరకు మెట్రో లైన్ కోసం గాలి అనిల్ చేపట్టబోయే ఉద్యమంలో తాము భాగస్వామ్యం అవుతామంటూ చెప్తున్నారు. సంగారెడ్డి వరకు మెట్రోను విస్తరించాలని డిమాండ్ తో గురువారం విడుదల చేసిన గాలి అనిల్ వీడియో ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది.