ఢిల్లీ మద్యం కుంభకోణంకు సంబంధించి అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించడంతో బీజేపీని టార్గెట్ చేసేందుకు కేసీఆర్ రెడీ అయ్యారా..? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ను ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇరికించేందుకు సిట్ కు పక్కా ఆధారాలు లభించాయా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన నిందితుల వాట్సప్ చాట్ బయటకు రావడం సంచలనంగా మారింది. ముగ్గురిని మీకు పరిచయం చేయాలని ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుడు రామచంద్రభారతి బీజేపీ నేత బీఎల్ సంతోష్ కు మెసేజ్ చేయగా..ఆర్ విశిష్ట గురించి డీహెచ్ చర్చించాలని సంతోష్ రిప్లై ఇచ్చారు. వీటిని సిట్ సేకరించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీకి ఊపిరిరాడకుండా చేసేందుకుగాను బీఎల్ సంతోష్ పాత్రకు సంబంధించి కీలకమైన ఆధారాలను సిట్ కనుగొన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 26న సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితుల్లో ఒకరైన రామచంద్ర భారతి మధ్య జరిగిన వాట్సప్ చాట్ ను నిపుణుల సహాయంతో సిట్ సేకరించినట్లు తెలుస్తోంది.
Also Read : దూకుడు పెంచిన ఈడీ – వెనకబడిపోతున్న సిట్
ఓ వైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు కొనసాగుతొంది. ప్రణాళికబద్దంగా పని చేస్తోంది. కాని సిట్ మాత్రం బయట వ్యక్తుల్ని ప్రశ్నించలేకపోతున్నది. ఇదిలా ఉండగానే మద్యం కుంభకోణం రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరును ఈడీ చేర్చడంతో సిట్ కూడా దూకుడు పెంచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ బడా నేతల ప్రమేయంపై ఆధారాలను సేకరించాలని సర్కార్ వైపు నుంచి సిట్ పై అధిక ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దూకుడు పెంచనున్నట్లు జరుగుతోన్న పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు.
కవితకు ఈడీ నోటిసులు గనుక జారీ చేస్తే… బీఎల్ సంతోష్ ప్రమేయంపై మరిన్ని ఆధారాలను సేకరించి ఆయన్ను విచారణకు సిట్ పిలిచే అవకాశం కనిపిస్తోంది.