రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ గాలి అనిల్ కుమార్. రైతు సమస్యలపై సర్కార్ నాన్చుడుధోరణిని వ్యతిరేకిస్తూ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు పఠాన్ చెరులోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన దీక్షలో గాలి అనిల్ కుమార్ పాల్గొన్నారు.
ధరణి , రైతు రుణమాఫీ , రైతు భీమా , పోడు భూములు, ధాన్యం కొనుగోలు , పంటలకు గిట్టుబాటు వంటి అంశాలలో రైతులకు సర్కార్ తీవ్ర అన్యాయం చెసిందని విమర్శించారు గాలి అనిల్. టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారని, దానికి తోడు రైతు సమస్యలను పూర్తిగా విస్మరించి రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్, బీజేపీలు ప్రజలను వంచిస్తున్నాయని, గడిచిన 8 ఏళ్ల కాలంలో ప్రజల సంక్షేమం కోసం రెండు ప్రభుత్వాలు చేసిందేమి లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకు దర్యాప్తు సంస్థల దాడులు, ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయన్నారు.
ధరణిలో మాయమైన 24లక్షల ఎకరాల భూవివరాలు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని గాలి అనిల్ కుమార్ అన్నారు. విలువైన భూములను కల్వకుంట్ల కుటుంబం కబ్జా చేయడంతోపాటు తన ఆనునయులకు కట్టబెడుతుందని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని విడనాడాలని డిమాండ్ చేసినా గాలి అనిల్, డిసెంబర్ 4నాటికీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.
రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులతో కలిసి పఠాన్ చెర్ తహసీల్దార్ కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా, బొల్లారం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ అనిల్ రెడ్డి జిన్నారం మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి , గుమ్మడిదల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డం శ్రీశైలం , పటాన్చెరు టౌన్ అధ్యక్షుడు నరసింహారెడ్డి పాల్గొన్నారు.