ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎంపీ. ఇద్దరు అధికార పార్టీకి చెందిన నేతలే. కాని వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. బహిరంగా వేదికలపైనే ఇద్దరు నేతలు కీచులాడుకుంటున్నారు. ఇంతకీ ఎవరా ఆ నేతలు…? తెలియాలంటే ఈ స్టొరీ చదవాల్సిందే.
మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్. మహబూబాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షురాలు ఎంపీ, మాలోతు కవిత ల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. కొంతకాలంగా ఈ ఇద్దరికీ అస్సలు పొసగడం లేదు. డీ అంటే డీ అంటున్నారు. ఈ నేపథ్యంలో మరో రచ్చ జరిగింది.
త్వరలో సీఎం కేసీఆర్ మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ కార్యాలయంతోపాటు మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవానికి కేసీఆర్ రానున్న నేపథ్యంలో పనులను పరిశీలించేందుకు వెళ్ళగా అక్కడ మాటల యుద్ధం జరిగింది. పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం తాను సొంత డబ్బులు ఖర్చు చేశానని శంకర్ నాయక్ చెప్పుకొచ్చారు. అందుకు కౌంటర్ ఇచ్చారు ఎంపీ కవిత. పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం ఖర్చును పార్టీనే భరిస్తుందని చెప్పడంతో ఇద్దరి మధ్య రచ్చ మొదలైంది. దీంతో మానుకోట రాజకీయం హీటేక్కింది.
వీరిద్దరి మధ్య రాజకీయ వైరం గత కొన్నాళ్ళుగా కొనసాగుతూనే ఉంది. ఆ మధ్య ఓ సభలో మాలోతు కవిత ప్రసంగిస్తుండగానే శంకర్ నాయక్ లేచి మైక్ లాగేసుకున్నారు. ఇది వివాదాస్పదం కావడంతో ప్రగతి భవన్ కు ఇద్దరినీ పిలిచి మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఇద్దరికీ నచ్చజెప్పారు. అయినప్పటికీ ఏ మార్పు లేదని తాజాగా తేలిపోయింది.
వచ్చే ఎన్నికల్లో మహబూబాబాద్ ఎమ్మెల్యే టికెట్ కోసం కవిత ప్రయత్నిస్తుందని.. అందుకే తన వ్యతిరేకులతో ప్రత్యేక వర్గం తయారు చేసుకొంటుందని శంకర్ నాయక్ ఆగ్రహంగా ఉన్నారు. దీంతో కవిత ఎత్తులను చిత్తు చేస్తు తన బలాన్ని నిరూపించుకునేందుకుగాను శంకర్ నాయక్ ఎక్కడ తగ్గడం లేదని అంటున్నారు.