తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆయన మాత్రం ముందస్తు ప్రసక్తే లేదని..షెడ్యూల్ మేరకే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసి ఊహాగానాలకు తాజాగా తెరదించారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న దృష్ట్యా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకొని…తెలంగాణ మోడల్ ను లోక్ సభ ఎన్నికల నాటికీ పలు రాష్ట్రాల్లో ప్రచారం చేసి ఓట్లు దండుకోవాలని వ్యూహం రూపొందించారు. ఏమైందో ఏమో కాని, ముందస్తుపై కేసీఆర్ సడెన్ గా వెనక్కి తగ్గారు.
ముందస్తుకు వెళ్లాలని తొలుత భావించిన కేసీఆర్ మళ్ళీ వెనక్కి తగ్గడానికి కారణం ఏంటని అంత చర్చించుకుంటున్నారు. మెజార్టీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉందని కేసీఆర్ కు నివేదికలు అందినట్లుగా చెప్తున్నారు. ఎమ్మెల్యేలు ప్రజల్లో లేకపోవడం, పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుండటంతోపాటు సర్కార్ సంక్షేమ పథకాల్లో లోపాలు , కొన్ని వర్గాలకే సంక్షేమ పథకాలు అందుతున్నాయన్న భావన వెరసి 80నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కు ఎదురీత తప్పదని తేలిందట. అయితే, కేసీఆర్ కు అందిన నివేదికలో గజ్వేల్ కూడా ఈసారి చేజారిపోనుందని తేలడంతో మరికొద్ది రోజుల్లోనే నియోజకవర్గ నేతలతో ఆయన భేటీ కానున్నారట. దాంతో వెంటనే పార్టీ కార్యవర్గ సమావేశాన్ని కేసీఆర్ ఏర్పాటు చేసి..కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలను వ్యవహారశైలి మార్చుకోవాలని సూచించినట్లుగా తెలుస్తోంది.
ప్రజల్లో వ్యతిరేకత కూడగట్టుకోవడంతోనే ఎమ్మెల్యేలు వచ్చే పది నెలలు ప్రజల్లోనే ఉండాలని కేసీఆర్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఈ పదినెలలు నియోజకవర్గాలకే ఎక్కువ సమయం కేటాయించాలని ఎమ్మెల్యేలకు చెప్పడం ఇందులో భాగమేనని అంటున్నారు. ప్రజల్లో విశ్వసనీయత పెంచుకోవాలని, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో ఫెయిల్ అయ్యారంటూ మంత్రులను కేసీఆర్ వాయించారట. ఆశించిన మేర ప్రజల మద్దతు లేకపోవడంతోనే ముందస్తు నుంచి కేసీఆర్ వెనక్కి తగ్గారని చెప్తున్నారు.