సిట్టింగ్ లందరికీ టికెట్లు ఇస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్యేలకు అభయం ఇచ్చారు. అయితే, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కూడా టికెట్ ఇస్తారా..? అనే దానిపై టీఆర్ఎస్ లో విస్తృత స్థాయి చర్చ జరుగుతోంది. 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అభివృద్ధి అంటూ కారెక్కారు. చేరికల సమయంలో టికెట్ పై స్పష్టమైన హామీ కేసీఆర్ ఇవ్వకపోవడంతో ఎప్పటి నుంచో వీరిని భవిష్యత్ బెంగ వెంబడిస్తోంది. ఈ సమయంలోనే సిట్టింగ్ లకే అవకాశం ఇస్తామని కేసీఆర్ ప్రకటనతో ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఆశలు చిగురించగా… ఈ 14నియోజకవర్గాల్లో గతంలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన నేతలు పార్టీని వీడే అవకాశం ఉంది.
2018లో కాంగ్రెస్ తరుఫున పోటీ చేసిన వారు నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థులు
పటోళ్ల సబితా ఇంద్రా రెడ్డి – మహేశ్వరం తీగల కృష్ణారెడ్డి
జాజుల సరేందర్ – ఎల్లారెడ్డి ఏనుగు రవీందర్ రెడ్డి
రేగ కాంతారావు – పినపాక పాయం వెంకటేశ్వర్లు
కందాల ఉపేందర్ రెడ్డి – పాలేరు తుమ్మల
హరిప్రియ – ఇల్లందు కోరం కనకయ్య
వనమా వేంకటేశ్వర రావు – కొత్తగూడెం జలగం వెంకట్రావు
చిరుమర్తి లింగయ్య – నకిరేకల్ వేముల వీరేశం
దేవిరెడ్డి సుధీర్ రెడ్డి – ఎల్బీనగర్ రామ్మోహన్ గౌడ్
ఆత్రం సక్కు – ఆసిఫాబాద్ కోవా లక్ష్మీ
బీరం హర్షవర్థన్ రెడ్డి – కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు
గండ్ర వేంకట రమణా రెడ్డి – భూపాలపల్లి మధుసూదనాచారి
రోహిత్ రెడ్డి – తాండూరు పట్నం మహేందర్
సండ్ర వెంకట వీరయ్య – టీడీపీ సత్తుపల్లి – పిడమర్తి రవి
మెచ్చా నాగేశ్వర్ రావు – టీడీపీ అశ్వరావుపేట తాటి వెంకటేశ్వర్లు
దాదాపు 10నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన నేతలు పార్టీ వీడే విషయమై చర్చలు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. తీగల కృష్ణారెడ్డి , జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్ రావు, వేముల వీరేశం, పట్నం మహేందర్ రెడ్డి, జలగం వెంకట్రావు, ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, పిడమర్తి రవి, కోవా లక్ష్మీ, కోరం కనకయ్యలు కేసీఆర్ తాజాగా చేసిన ప్రకటనతో తీవ్ర నిరాశ చెందారని..దాంతో వారంతా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
ఇదే జరిగితే ఈ పద్నాలుగు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ బలహీన పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ నేతలతో బీజేపీ, కాంగ్రెస్ నేతలు సంప్రదింపులు షురూ చేశారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తుమ్మల, జూపల్లి, తీగల, వేముల వీరేశం , పిడమర్తి రవి, పట్నం మహేందర్ రెడ్డి లు కాంగ్రెస్ లో చేరే విషయమై చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. టికెట్ ఇస్తామని హామీ ఇస్తే గోడ దూకేందుకు సిద్దంగా ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.