హుజురాబాద్ టీఆర్ఎస్ లో ముసలం పుట్టింది. నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ , ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ నాకంటే నాకేనని ఇద్దరు నేతలు వరుస ప్రకటనలు చేస్తున్నారు. దీంతో నియోజకవర్గ టీఆర్ఎస్ శ్రేణులు అయోమయానికి గురి అవుతున్నారు.
70మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందా..?
తాజాగా ఇల్లందకుంటలో గ్రామాల వారీగా టీఆర్ఎస్ కార్యకర్తలతో పాడి కౌశిక్ రెడ్డి అంతర్గతంగా సమావేశాలు నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ వస్తుందంటూ పార్టీ శ్రేణుల మద్దతు కూడగట్టుకొనే ప్రయత్నం చేశారు. టికెట్ విషయమై తనకు కేసీఆర్ నుంచి హామీ వచ్చిందని చెప్తున్నారు. పార్టీలో ఉంటూ కోవర్ట్ రాజకీయం చేస్తే సహించేది లేదంటూ తన ప్రత్యర్ధులకు హెచ్చరికలు పంపారు కౌశిక్ రెడ్డి. తాజా పరిణామాలతో గెల్లు శ్రీనివాస్ వర్గం పాడి కౌశిక్ రెడ్డిపై ఆగ్రహంగా ఉంది. టీఆర్ఎస్ ఇంచార్జ్ గెల్లు శ్రీనివాస్ కు సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలో కౌశిక్ సమావేశాలు నిర్వహించడం పట్ల పెదవి విరుస్తున్నారు. పార్టీకి నష్టం చేకూర్చే చర్యలను మానుకోవాలని, పాడి తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నారు.
టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. మీకే తెలివి ఉందా – మాకు లేదనుకుంటున్నావా..!
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఉప ఎన్నికల్లో గెల్లు ఓటమి కోసం తెర వెనక పాడి కౌశిక్ రెడ్డి చక్రం తిప్పారని గెల్లు వర్గం భావన. జరిగిన ఆ ఉప ఎన్నికల్లో గెల్లు విజయం సాధిస్తే వచ్చే ఎన్నికల్లో తనకు అధిష్టానం టికెట్ నిరాకరిస్తుందని… తన అనుచరులతో గెల్లుకు వ్యతిరేకంగా ప్రచారం చేయించాడని పాడి కౌశిక్ పై ఆరోపణలు ఉన్నాయి.
ఈ క్రమంలోనే గెల్లుకు సమచారం లేకుండా పార్టీ కార్యకర్తలతో పాడి కౌశిక్ రెడ్డి అంతర్గతంగా సమావేశాలు నిర్వహించడం… ఇద్దరి నేతల మధ్య ఆధిపత్యపోరుకు సంకేతంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. వచ్చె ఎన్నికల్లో తనకు టీఆర్ఎస్ మరోసారి టికెట్ కేటాయిస్తుందని గంపెడు ఆశలు పెట్టుకున్న శ్రీనివాస్ యాదవ్.. నియోజకవర్గంలో బలం పెంచుకునేందుకు వరుసగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గెల్లుకు కౌంటర్ గా పాడి కౌశిక్ రెడ్డి కూడా పర్యటనలు చేస్తోండటంతో క్యాడర్ లో కన్ఫ్యూజన్ నెలకొంది.