క్యాసినో వ్యవహారం తీవ్ర దుమారం రేపడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు చికోటి ప్రవీణ్. ఆయనకు పలు రాజకీయ పార్టీలకు చెందిన కీలక నేతలతో సంబంధాలూ ఉన్నాయి. కరుడుగట్టిన హిందుత్వ వాది అయిన చికోటి ప్రవీణ్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వ్యాపార రంగం నుంచి రాజకీయాల్లోకి రావాలనిపిస్తే పాలిటిక్స్ లోకి కూడా వస్తానని మనస్సులో మాటను ప్రవీణ్ బయటపెట్టారు.
మత విద్వేషాలు రెచ్చగొట్టారనే కేసులో అరెస్టై ఇటీవలే బెయిల్ పై విడుదలైన రాజాసింగ్ ను కలిసిన అనంతరం చికోటి ప్రవీణ్ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పై బీజేపీ తరుఫున మీరు పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు..? అని మీడియా ప్రతినిధులు చికోటి ప్రవీణ్ ను ప్రశ్నించారు. ఇందుకు ఆయన సమాధానమిస్తూ..ప్రస్తుతం తాను ఏ పార్టీలో లేనని చెప్పేశారు. అంతేకాదు, సిరిసిల్లను కేటీఆర్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తాను సిరిసిల్లలో పోటీ చేస్తున్నాననే కథనాలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు.
వ్యాపారరంగంలో ప్రస్తుతం హ్యాపీగా ఉన్నానని.. రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంటె హిందుత్వానికి ప్రాధాన్యత ఇచ్చే పార్టీలో తన చేరిక ఉంటుందని వ్యాఖ్యానించారు. కుటుంబం, సన్నిహితులతో సంప్రదించిన తరువాతే రాజకీయ ప్రకటన ఉంటుందని..రాజకీయాల్లోకి వస్తే అందరికి చెబుతానని వెల్లడించారు. పార్టీలోకి రావాలని ఆహ్వానం అందితే రాజకీయాల్లోకి రావొచ్చునని చెప్పారు.