తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీఎం చైర్ బోర్ కొట్టినట్లు ఉంది. అందుకే ప్రధాని పీఠంపై గురి పెట్టారు. కొడుకు ఒత్తిడో, కూతురిపోటు ఏమో కాని ఆయన రాష్ట్ర రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోనున్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్, పలు రాష్ట్రాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. ఇందుకోసం కసరత్తు జరుగుతోంది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడం ఖాయం కావడంతో పాలన వ్యవహారాలను కేటీఆరే చూసుకుంటున్నారు. కొద్దికాలంగా ఆయనే యాక్టింగ్ సీఎంగా కొనసాగుతున్నారు.
మంత్రులు తమ శాఖ పెండింగ్ పనుల కోసం సీఎంను సంప్రదించేందుకు కేసీఆర్ అపాయింట్మెంట్ కోరితే…ఒకవేళ ఆయన నిరాకరిస్తే కేటీఆర్ ను సంప్రదిస్తున్నారు. అన్ని శాఖల పనితీరుపై కేసీఆర్ సుపుత్రుడే మానిటరింగ్ చేస్తున్నారు. కేటీఆర్ ఓ మంత్రి అయ్యుండి సహచర మంత్రులకు ఆర్డర్స్ పాస్ చేయడం చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలి పబ్ కేసు కావొచ్చు, బాసర ఐఐఐటీ విద్యార్థుల సమస్యలు కావొచ్చు, నిజాం కాలేజ్ ఇష్యూ కావొచ్చు. విషయం ఏదైనా కేటీఆరే మంత్రులకు ఆదేశాలు ఇస్తున్నారు. సీఎం గప్ చుప్ గా ఉంటె ఓ మంత్రి తన శాఖ పరిధిని దాటి సహచర మంత్రులకు ఆదేశాలు ఇవ్వడమేంటనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
కేటీఆర్ ఇలా మంత్రులకు ఆర్డర్స్ పాస్ చేయడం వలన ప్రజల్లోకి తప్పుడు సందేశం వెళ్తోంది. కేటీఆర్ మినహా కేసీఆర్ మంత్రివర్గంలోని మంత్రులంతా పరిపాలన చేతకాని దద్దమ్మలు అనే మెసేజ్ వెళ్తుందని..సహచర మంత్రులకు కేటీఆర్ ట్వీట్స్ చేస్తూ ఆదేశాలు ఇవ్వడం మానుకోవాలని..అవే ఆదేశాలను కేసీఆర్ తో ఇప్పించాలంటున్నారు. తన స్థాయికి మించి కేటీఆర్ వ్యవహారశైలి కనిపిస్తోందని.. అదే సమయంలో తనను తాను నిరూపించుకునేందుకు ఈ విధమైన ట్వీట్స్ చేస్తున్నాడన్న చర్చ కూడా జరుగుతోంది.
మరో ఏడాదిలో తెలంగాణలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన కేసీఆర్ కొడుకును సీఎం సీటులో కూర్చోబెట్టే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇప్పటి నుంచే కేటీఆర్ తన కోటరీని రెడీ చేసుకుంటున్నారన్న వాదనలు టీఆర్ఎస్ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. ముందుగానే ఎవరి పనితీరు ఎలా ఉంటుందో కేటీఆర్ పర్యవేక్షిస్తున్నారని చెబుతున్నారు.