ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిందితుల దర్యాప్తుపై స్టే ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్న ఉన్నత న్యాయస్థానం… దర్యాప్తు చేసుకోవచ్చునని మొయినాబాద్ పోలీసులను ఆదేశించింది. గతంలో దర్యాప్తును నిలిపివేయాలని ఇచ్చిన స్టే ను తాజాగా రద్దు చేస్తునట్లు పేర్కొంది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే విధించింది. మంగళవారం మరోసారి ఈ పిటిషన్ పై విచారణ చేసిన న్యాయస్థానం దర్యాప్తు నిలిపివేయాలని గతంలో ఇచ్చిన స్టే ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ముగ్గురు నిందితులను విచారించేందుకు మొయినాబాద్ పోలీసులకు మార్గం సుగమమైంది. విచారణ పురోగతిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను 18కి వాయిదా వేసింది హైకోర్టు. హైకోర్టు ఆదేశాలతో ముగ్గురు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు.