ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కేంద్ర దర్యాప్తు సంస్థలు వెంబడిస్తున్నాయి. ఎలాగైనా ఈ కేసులో కవితను సేవ్ చేయాలని తలుస్తోన్న సీఎం కేసీఆర్ ఇటీవల ఢిల్లీ వెళ్లి ఆప్ నేతలతో సంప్రదింపులు జరిపారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళనతో ప్రగతి భవన్ వర్గాలు లిక్కర్ స్కాం ఎపిసోడ్ ను క్షుణ్ణంగా వాచ్ చేస్తున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్ర పిళ్ళై అప్రూవర్ గా మారాడని వార్తలతో ఉలికిపడినా ఈ కేసుకు సంబంధించి ఆయన సహకరించడం లేదని తెలుస్తోంది.
కాళేశ్వరం , మిషన్ భగీరథలపై టీఆర్ఎస్ సర్కార్ పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సీబీఐకి ఫిర్యాదులు కూడా అందాయి. బీజేపీ అగ్రనేతలు సైతం కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని ఆరోపిస్తున్నారు. కాళేశ్వరం కమిషన్లపై సీబీఐ ఫోకస్ చెసిందని త్వరలోనే విచారణ చేపట్టే అవకాశం ఉందని బీజేపీలోని టీఆర్ఎస్ కోవర్టులు కేసీఆర్ కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేసీఆర్ సీబీఐ జనరల్ కన్సెంట్ ను రద్దు చేసినట్లుగా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇదిలా కొనసాగుతుండగానే మునుగోడు ఉప ఎన్నిక ఫలితం ముగిసిన వెంటనే లిక్కర్ స్కాం నిందితుడు దినేష్ ఆరోరాను అప్రూవర్ గా మార్చింది సీబీఐ. ఆయనను సాక్షిగా పరిగణించాలని కోరుతోంది. ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ టార్గెట్ కల్వకుంట్ల కవితేనని తెలుస్తోంది. ఆమెకు త్వరలోనే సీబీఐ అధికారులు నోటిసులు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. దినేష్ అప్రూవర్ గా మారడంతో ఈ కేసులో కీలక పరిణామాలు ఉండటం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.