ఉమ్మడి మెదక్ జిల్లాలోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఎలాంటి స్పందన లభించిందో అలాంటి స్పందనే మెదక్ జిల్లాలోనూ కనిపిస్తుండటం కాంగ్రెస్ శ్రేణులను ఉత్సాహపరుస్తోంది. భారత్ జోడో యాత్రను సక్సెస్ చేయడంపై ప్రత్యేక దృష్టి సారించిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ గాలి అనిల్ కుమార్ కళ్ళు చెదిరేలా ఏర్పాట్లు చేశారు. రాహుల్ యాత్ర కొనసాగే దారులను కటౌట్లు, ఫ్లెక్సీలతో నింపేసి మెతుకుసీమలో జోడో యాత్రపై జనాల్లో విస్తృత చర్చ జరిగేలా చేయడంలో సక్సెస్ అయ్యారు.
హేమాహేమీలైన కాంగ్రెస్ నేతలు జిల్లాలో ఉన్నప్పటికీ గాలి అనిల్ కుమార్ పార్లమెంట్ ఇంచార్జ్ గా కొనసాగుతుండటంతో ఈ యాత్రను విజయవంతం చేసే బాధ్యతను ఆయనే తీసుకున్నట్లు తెలుస్తోంది. యాత్రకు వెల్కం చెబుతూ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు కన్నులవిందు చేస్తున్నాయి. అలాగే, ఎల్ఈడీ తెరలు, ఎల్ఈడీ వాహనాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. భారత్ జోడో యాత్రలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో, సబ్బండ వర్గాల ప్రజలతో రాహుల్ గాంధీ సంభాషణ, సమస్యలు తెలుసుకుంటూ కదిలిన తీరు ఎల్ఈడీ తెరలపై ప్రత్యక్షం అవుతుండటంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
మెదక్ పార్లమెంట్ నుంచే 1980 ఎన్నికల్లో ఇందిరాగాంధీ పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రేసులోనున్నారు గాలి అనిల్ కుమార్. దాంతో భారత్ జోడో యాత్ర రూట్లో పలుచోట్ల ఇందిరాగాంధీ హయాంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో జరిగిన అభివృద్ధి పనుల ఫొటోలతో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఇందిరా గాంధీ ప్రాతినిధ్యం వహించిన సమయంలో మెదక్ జిల్లా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిందని, ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసి లక్షలాదిమందికి ఉపాధి కల్పించారని గాలి అనిల్ గుర్తు చేశారు.
దేశ రక్షణ రంగానికి సంబంధించిన బీహెచ్ఈఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని, ఈ విషయాన్ని రాహుల్ గాంధీతో చర్చించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీహెచ్ఈఎల్ సంస్థను ప్రైవేట్ పరం చేయకుండా తాను పోరాడుతానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇక, మెదక్ జిల్లాలో భారత్ జోడో యాత్ర ఏర్పాట్లపై గాలి అనిల్ కుమార్ స్పందించారు. ఈ యాత్రకు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశామని, పార్టీ నేతలందరి సహకారంతో భారత్ జోడో యాత్రను సక్సెస్ చేసి..ఈ యాత్ర చరిత్రలోనే మెదక్ జిల్లాలో చేసిన ఏర్పాట్లు చిరస్థాయిగా నిలిచేపోయేలా చేశామన్నారు. దేశం కోసం, సబ్బండ వర్గాల ప్రజల కోసం చేస్తోన్న రాహుల్ చేస్తోన్న ఈ యాత్రకు పార్టీలకతీతంగా ప్రజలు సహకరిస్తున్నారని , మరో క్విట్ ఇండియా పోరాటాన్ని భారత్ జోడో యాత్ర గుర్తు చేస్తోందని వ్యాఖ్యానించారు గాలి అనిల్.