మునుగోడు ఉప ఎన్నికల్లో ఓట్లు రాల్చుకునేందుకు డబ్బును అస్త్రంగా వాడుతున్నారు. ఇందుకోసం బీజేపీ, టీఆర్ఎస్ లు పోటీపడుతున్నాయి. కాంగ్రెస్ మాత్రం అత్మగౌరవ ఎజెండాతో ఓట్లను అభ్యర్థిస్తోంది. ఈ ధన ప్రవాహంలో టీఆర్ఎస్ కు ఎలాంటి ఇబ్బందులు లేవు. బీజేపీ నేతలు మాత్రం డబ్బు సంచులతో పట్టుబడుతున్నారు. ఎన్ని టెక్నిక్ లు యూస్ చేస్తోన్నా ఫలితం కనిపించకపోవడంతో రాజగోపాల్ రెడ్డి నేరుగా బ్యాంక్ అకౌంట్లోకే నగదు బదిలీ చేశారు.
కాంగ్రెస్ పార్టీకి , ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడానికి ప్రధాన కారణం తన కుటుంబానికి చెందిన సుశీ ఇన్ ఫ్రా కంపెనీకి 18వేల కోట్ల కాంట్రాక్ట్ రావడమేనని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. తాజాగా సుశీ కంపెనీ నుంచి మునుగోడు నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులకు భారీగా డబ్బు బదిలీ అయింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు బయటకు రావడంతో రాజగోపాల్ రెడ్డి ఇరకాటంలో పడిపోయారు.
ఐదు కోట్లకు పైగా నగదు ట్రాన్స్ ఫర్ చేసిన రాజగోపాల్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు అందటంతో ఆయనకు నోటిసులు జారీ చేసింది. ఆ డబ్బులను ఎందుకు ట్రాన్స్ ఫర్ చేశారో చెప్పాలంటూ వివరణ కోరింది. పోలింగ్ కు సమయం దగ్గర పడుతోన్న సమయంలో నేతలకు డబ్బు ట్రాన్స్ ఫర్ చేయడమంటే ఓటర్ల కొనుగోలు కోసమేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మరి, ఈసీ జారీ చేసిన నోటిసులపై ఆయన ఎలాంటి సమాధానం ఇస్తాడో చూడాలి.